‘‘ఎందుకు?’’సాటివాళ్లు వేసే ఈ ప్రశ్నకుసమాధానంచెప్పాలని తెలుసు డాక్టర్‌ ఆదినారాయణకి.అందరికన్నాముందు అడిగేది డాక్టర్‌ వీరారెడ్డి.తర్వాత మిసెస్‌ దేబ్‌ ఛటర్జీ.తర్వాత డాక్టర్‌ కెవిన్‌.తర్వాత.. తర్వాత.. ఇంకొకరు.. ఇక ఆలోచించలేకపోయాడు.అందరూ తోటి డాక్టర్లే. మనిషినాడి తెలిసినవాళ్లే. మనసు నాడితెలుసా మరి?

ఎంతమంది అడిగినా తానేమి చెప్పడు. చెప్పినా వాళ్లెవరికీ అర్థం అవుతుందని అనిపించడం లేదు.ఇన్నేళ్లు కలిసి బతికిన సుధకే అర్థం కానప్పుడు ఇంకెవ్వరో అర్థం చేసుకుంటారని ఎలా అనుకుంటాడు?చాలు. ఇక చెప్పాల్సిందేం లేదు.చెయ్యవలసిందే ఉంది.ఉదయాన్నే లేచాడతను. బ్యాగ్‌ సర్దుకున్నాడు. తానూ, సుధా, కొడుకూ ఉన్న ఫోటో బ్యాగ్‌లో పెట్టుకుందామనుకున్నాడు.అది తాము అరకు వెళ్లినప్పుడు వ్యూపాయింట్‌ దగ్గర తీసుకున్నది. వెనకాల ఆకుపచ్చని కొండలు. తల్లిదండ్రులను వదిలి పోలేమన్నట్లు అక్కడక్కడే తిరుగుతున్న మబ్బులు. పదిహేడేళ్ల వయసులో నవ్వుతూ ఉన్న కొడుకు ముఖం చూస్తే, ఆ వయసులో తాను అలాగే ఉండేవాడనుకున్నాడతను.మరి నాన్న? ఆయనా అలాగే ఉండేవారేమో!గట్టిగా ఊపిరి తీసి వదిలాడు ఆదినారాయణ. ఫోటోను ఒకసారి తుడిచి బ్యాగ్‌లో పెట్టుకున్నాడు.

గది నుంచి హాల్లోకొచ్చాడు. మధ్యలో ఇత్తడి గంగాళం. దాన్నిండా నీళ్లు. నీళ్లలో తేలుతున్న పువ్వులు. అటూఇటూ హంసల ముక్కు నుంచి వెలుగుతున్న దీపాలు. వెనకగా వేణుగోపాలుడి విగ్రహం. ఎన్నేళ్లకిందటిదో. అన్నీ యాంటిక్సే. కర్ణాటకలోని ఓ సముద్ర తీర గ్రామంలో ఎవరో అమ్మేస్తుంటే కొన్నది సుధ.గోడల మీద తంజావూరు పెయింటింగులు లక్ష్మీ, సరస్వతి. శ్రీరంగంలో ఓ ఇంటివాళ్లు పడేస్తే తెచ్చి ఫ్రేమ్‌ చేయించింది. కలంకారీ చిత్రాలు శివుడు, పార్వతి, వాళ్ల ఒడిలో బుల్లి వినాయకుడు.ఇదెక్కడిదో..? గుర్తు రాలేదు. బ్యాగు కిందపెట్టి ఒకసారి ఆ ఫ్రేమును చూశాడు. ఆ పక్కనున్న కారు తాళాలు అందుకున్నాడు.ఒకడుగు ముందుకేసి మళ్లీ వెనక్కివచ్చాడు. చేతిలో ఉన్న తాళాలు అక్కడ నగిషీ బల్ల మీద పెట్టేసి ఇంకాస్త ముందుకి నడిచాడు. మెట్ల ముందు వరసగా పేర్చిపెట్టిన గంగాళాల్లాంటి ప్లాంటర్స్‌. అందంగా ఆరోగ్యంగా ఎదుగుతున్న ఇండోర్‌ ప్లాంట్స్‌.సుధ కనుసన్నల్లో అన్నీ పద్ధతిగా పెరగాలి. పెరుగుతాయి.ఎప్పుడు చూసినా అన్నీ సర్దిపెట్టి పద్ధతిగా ఉండాలి. ఉన్నాయి.