‘‘నాన్నా! మనకెందుకుకొచ్చిన గొడవ. పట్టించుకోకు’’‘‘అలా అంటావేమిట్రా? పక్కనున్న ఫ్లాట్‌లో అంతగొడవ జరుగుతూంటే, వినీవిననట్లు ఎలా ఉండమంటావు?’’‘‘ఫ్లాట్‌ కల్చర్‌ వేరు నాన్నా! పక్క ప్లాట్‌లో హత్య జరిగినా మనం పట్టించుకోకూడదు’’‘‘అలాంటప్పుడు అడవిలోనే ఉండచ్చుగా. కల్చర్డ్‌.... కల్చర్‌... కన్నకొడుకు తల్లిని పట్టుకుని బండ బూతులు తిడుతూంటే అలా వింటూ ఊరుకోమంటావేమిటి? వెధవని చఢా మఢా నాలుగు తగిలించొస్తా’’‘‘నువ్వు కొడితే ఎవరూపడరు. తిడితే ఊరుకోరు. కొట్టుకున్నా తిట్టుకున్నా, చివరికి తల్లీకొడుకులు ఏకమై తప్పునీదే అంటారు’’.

‘‘అలా అంటారని ఊరుకుంటే ఎలా! కనీసం మాటసాయం చేయినవాడు మనిషేకాదు. మదర్‌ థెరిస్సా అంతస్థాయిలో సేవ చేయలేకపోయినా మనకి తెలిసిన ఓ నాలుగు మంచిమాటలు చెప్పలేకపోతే ఎలా?’’‘‘నీ టీచర్‌ బుద్ధి పోనిచ్చుకోవటంలేదునాన్నా! సరే నువ్వు రీసెంట్‌గా రిటైయిరైన ఆ స్కూలుకివెళ్ళి నాలుగోక్లాసు కుర్రాడికి నాలుగు మంచిమాటలు నేర్పు, వింటాడేమో చూద్దాం’’.‘‘వినకపోతే వాళ్ళ ఖర్మ. చెప్పడం నా ధర్మం’’. కాంతారావుగారు రిటైర్డ్‌ టీచర్‌. భార్యపోయాక, పుట్టిపెరిగిన ఊర్లోనే ఒంటరిగా ఉండిపోయారు. ఇప్పుడు కొడుకు,కోడలు బలవంతంమీద తప్పనిసరై సిటీకొచ్చి వాళ్ళతోనే ఉంటున్నారు.

తెల్లవారుఝామునే లేవడం, తన ప్రియనేస్తం ‘టార్జన్‌’ గాడితో మార్నింగ్‌వాక్‌కి వెళ్ళడం, ఇంటికి తిరిగొచ్చి దానికి స్నానం చేయించి, తను స్నానం చేసి పూజ చేసుకోవడం, టిఫిన్‌ తిని, దానికి తినిపించి పేపరు చదువుకోవడం. వరదొచ్చినా, వానొచ్చినా ఇదీ ఆయన దినచర్య. పూజ చేస్తున్నంతసేపూ బుద్ధిగా కూర్చుంటున్న ‘టార్జన్‌’ క్రమశిక్షణచూసి ముచ్చటపడి ‘‘వీడు కాలభైరవుడ్రా. పూర్వజన్మ సంస్కారంగల కుక్కరా’’ అంటూ దాన్ని నిమురుతూ మురిసిపోతారు కాంతారావుగారు.ఒకరోజు పక్క ఫ్లాట్‌ గుమ్మంలో వేసిన ముగ్గుచూసి ముచ్చటపడి, ముగ్గుతొక్కకుండా జాగ్రత్తగా లిఫ్ట్‌ తీసి కిందకుదిగారు కాంతారావుగారు. మరోరోజు ఆ గుమ్మానికి కట్టిన మామిడాకులు చూసి మురిసిపోయారు.