మొండివైఖరితో చక్కని కుటుంబంలో మనశ్శాంతిని పాడుజేసింది ఆ కన్నతల్లి. దాంతో యజమాని పదవి కోల్పోయాడు తండ్రి. కూతుళ్ళకు లేనిపోనివి నూరిపోసి కన్నతండ్రిపై వారికి విరక్తికలిగించింది. కోడలిని రాచిరంపాన పెట్టింది. చేయగలిగినవన్నీ చేసింది. పెద్దకొడుకు అశక్తుడై దూరంగా వెళ్ళిపోయాడు. మరి చిన్నకొడుకు ఏం చేశాడు? ఆ కుటుంబాన్ని అతడేమన్నా ఉద్ధరించగలిగాడా?

పనికట్టుకుని బదిలీ చేయించుకుని పూనే వెళ్ళిపోయాడు మంగతాయారు పెద్దకొడుకు భాస్కర్. అక్కడ కాపురంపెట్టిన పక్షం దినాలకు తమ్ముడు రమేష్‌కు ఓ సుదీర్ఘమైన లేఖరాశాడు. ఆ లేఖను లాయర్‌ విష్ణుమూర్తి చిరునామాకు కొరియర్‌ చేశాడు. రమేష్‌ ఆయన దగ్గర జూనియర్‌గా పనిచేస్తున్నాడు. అన్నయ్య రాసిన లేఖ అందుకుని ఆశ్చర్యంగా ఆ కవరు విప్పాడు రమేష్‌.‘‘తమ్ముడూ, ఎంతోకాలంగా నాలో దిగులు రేపుతున్న కొన్ని విషయాలు నీకు చెప్పి నా ఆవేదన, ఆందోళన నీతో పంచుకోవాలనీ, నువ్వు లాయరువి కాబట్టి బాగా ఆలోచించి సమస్యలన్నీ పరిష్కరించే ప్రయత్నం చేస్తావనే ఆశతో ఇది రాస్తున్నా. రమేష్‌! ఒక ముఖ్య విషయం, చదవగానే ఈ ఉత్తరం చించిపారేయడం మరచిపోకు.

రమేష్‌! కూడూ, గుడ్డకు కొరతలేకపోయినా మన ఇల్లు ఒక శత్రుశిబిరంలా తయారైంది. ఉన్న నలుగురైదుగురిలోనే ఒకరంటే ఒకరికి పడదు. అకారణ ద్వేషం, విముఖత, ఒక్కొక్కరు మాట్లాడే విధానంలోనూ ఉపయోగించే భాష స్థాయిలోనూ తేడాలుంటాయి. సౌమ్యత, రమ్యత, ఆప్యాయత ఆకట్టుకునే విధానం ఆ మాటల్లో కనిపించనే కనిపించదు. ఎందుకో ఏమిటో అర్థం కాదు. పదవీ విరమణ తర్వాత నాన్న, ఇంటి యజమాని పదవిని కూడా కోల్పోయాడు. ఇంట్లోవాళ్లకి ఆయనో డెడ్‌వుడ్‌లా కనిపిస్తున్నాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే తెలుగు ఇల్లాలు ఎక్కడా ఏ పరిస్థితుల్లోనూ చదువు, సంస్కారం, ధనబలంతో బలిసిపోతేతప్ప భర్తల గురించి చెడుగా తప్పుగా మాట్లాడడం నేను ఎక్కడా కనలేదు, వినలేదు. మరి అమ్మ ఎందుకిలా ద్వేషం కుమ్మరిస్తోందో నేను అర్థంచేసుకోలేక పోతున్నారా తమ్ముడూ!