ఆ మేస్టారు కలహప్రియుడు. ఏదో చెయ్యాలనుకుని ఇంకేదో చేసేవారు. కలహాలతో నవ్వులపాలౌతూ ఇతరులకు వినోదం పంచేవాడు. చివరకు ఒక స్వామీజీ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. తన కోరికలు నెరవేర్చుకోవడానికి ఆ స్వామీజీనే మనసావాచాకర్మణా నమ్ముకున్నారు మేస్టారు. ఆ స్వామీజీ కూడా పెద్దగా కోరిలేమీ కోరేవాడు కాదు భోజనంతప్ప. ఇంతకూ ఆ ఇద్దరి కోరికలూ నెరవేరాయా లేదా?

గుర్నాధం మేస్టార్ని ఎరుగుదురా మీరు? ఎరిగి ఉంటే... అతగాడితో మీకు ఏదో సందర్భంలో ‘కలహక్రీడ’ ఆడిన ఎక్స్‌పీరియన్స్‌ ఉండే ఉండి ఉంటుంది కదూ? ‘‘అబ్బే లేదండీ ఆయన, నేనూ కూడా చాలా శాంతస్వభావులం’’ అని మీరంటే, మీరు పచ్చిఅబద్ధాల కోరనే అభిప్రాయానికి రావాల్సివస్తుంది నేను. కారణం, ఏ గేమూ ఆడడం బొత్తిగారాని గుర్నాధానికి దెబ్బలాటే ఫేవరెట్‌ గేం. అందువల్ల తనతో పరిచయమున్న...ఆ మాటకొస్తే తనతో ఒక్కమాటైనా మాట్లాడిన ప్రతివ్యక్తితో ఏదోఒక కారణం చూపించి పోట్లాడి అమితానందం పొందే జీవి అతను. ఇంకో విషయం, అతని పోట్లాటకి అవతలివ్యక్తి పసివాడా, పడుచువాడా, ముసలాడా అనే వయోభేదంగానీ, ఆడమగ అనే విచక్షణగానీ ఏ మాత్రం అడ్డుకావు.

ఓ రోజు...ఆరవతరగతి పిల్లలకి గుర్నాధం క్లాసు తీసుకుంటూ, ‘‘రాజమహేంద్రవరం ఏ పుణ్యనది తీరాన ఉన్నది?’’ అని ప్రశ్నించి, ఆఖరిబెంచీలో ఓకుర్రాడిని ఆ ప్రశ్నకు జవాబు చెప్పమని అడగబోతుండగానే, ఓ చురుకైన ముందుబెంచీ కుర్రాడు ఉండబట్టలేక ‘గోదావరి’ అనేసి, ఠక్కున నోరు నొక్కుకుని, భయంతో వణకిపోతూ మిడిగుడ్లు వేసుకుని గుర్నాధంవైపు చూశాడు. అంతే! గుర్నాధానికి కోపం ప్రమాదసూచిక దాటి తన్నుకొచ్చింది. వాడిని మండుటెండలో నిలబెట్టడానికి డిసైడ్‌ చేసుకుని, బయటికి చెయ్యి చూపిస్తూ ‘‘గెట్టౌ....ట్‌’’ అని అరిచాడు నోరుని గుహలా తెరచి.ఆ కుర్రాడు అవమానభారంతో తలొంచుకుని బయటకునడచి గుమ్మంబయట మండుటెండలో నుంచున్నాడు. క్లాసయ్యాక బయటకివెళ్తూ వాడితో ‘‘లోపలికి పో’’ అని చెప్పాలనిపించింది గుర్నాధానికి. ‘‘బయటకుపో’’ అనడానికి ‘‘గెట్టౌట్‌’’ అని ఇంగ్లీష్‌లో అన్నాడు కాబట్టి, ఇదీ ఇంగ్లీషులోనే అంటే తన లెవెల్‌కి బ్యాలన్స్‌ అవుతుందని కూడా అనిపించింది. కాని దానికి ఇంగ్లీషులో ఏమనాలో తెలియక, బయటకు నడచి, ‘‘గెట్టౌ....ట్‌’’ అని ఉరుముతూ, క్లాసురూమలోకి చెయ్యి చూపించాడు.

గుర్నాధం ఇంగ్లీష్‌ ప్రతిభకి, ఎర్రటిఎండలో మాడిపోయి నీరసంతో వేళ్ళాడిపోతున్న ఆ కుర్రాడికి కూడా నవ్వు సునామీలా తన్నుకు రాగా ఫక్కున నవ్వేశాడు. అంతే! కరిగిన తారుమీద కాలువేసినట్లు చిందులు ప్రారంభించిన గుర్నాధం చెయ్యి రైల్వేగేట్‌ లా పైకి లేచింది. అతనిచేతిలో వాడి చెంపలు వాచిపోయేవే. సమయానికి అప్పటికే అక్కడికివచ్చిన ఇంగ్లీష్‌మేస్టారు గుర్నాధం మాటలకి తనలో నుండి కూడా తన్నుకొస్తున్న నవ్వుని పంటిబిగువున నొక్కిపట్టి, ‘కిసిక్కు’ మంటూ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో వదుల్తూ, ఆ కుర్రాడిని తన వెనుక దాచుకుని రక్షించారు. మొహం కందగడ్డలా చేసుకుని అక్కడ నుంచి కదిలాడు గుర్నాధం.