బాలరాజంటే ఉరుకులు, హుషారు. ఊరించే కళ్ళు, ఉంగరాలజుట్టు. అది భుజాలమీద జారుతూ జలపాతం పాయలవుతుంది. అగరుత్తుల పొగలా తేలుతూ గాల్లో వంకీలు తిరుగుతుంది. బాలరాజు అలా కనిపించాడంటే జట్కా తోలుతున్నాడన్న మాట. అప్పుడు బొటన వేలినీ, చూపుడు వేలినీ కలిపి బాలరాజు వేసిన ఈల పదివీధులకు వినిపించేదట. కమ్చీ ఝళిపించే పనిలేకుండానే పంచకల్యాణి పరుగులు తీసేదట! లాయర్ లక్ష్మాజీరావుగారి జట్కా సారథి బాలరాజు గురించి బెలగాం సెంటర్‌లో వైనాలు వైనాలుగా చెప్పుకునేవారు.

ఏనాటి సంగతులో! ఎన్ని తరాలు గడిచాయో! అగ్రహారంవీధిలో పాచిపనులు చేసుకునే గున్నప్ప పెద్దకొడుకు సింహాద్రి. ‘బాలరాజు’ సినిమాచూసి, సింహాద్రి హీరో ఏయెన్నార్ కి వీరాభిమానిగా మారిపోయాడట. అభిమానహీరోను అనుకరిస్తూ భుజాలమీద పడేలా ఉంగరాలజుట్టు పెంచాడట. అది చూసిన లాయర్ లక్ష్మాజీరావుగారు ‘సింహాద్రీ’ అనడం మానేసి, ‘బాలరాజూ’ అని పిలవడం మొదలెట్టారట. దాంతో బెలగాం సెంటర్ నుంచి పార్వతీపురం టౌను రాయగడ రోడ్డువరకు సింహాద్రిని మరచిపోయారు. ‘జట్కా బాల రాజు’నే గుర్తుంచుకున్నారు.కొన్నాళ్ళకి ‘సంసారం’ సినిమా వచ్చింది. అందులో ‘కల నిజమాయెగా..’ పాట బాలరాజుకి నచ్చింది. ఆ పాటలో ఏయన్నార్ పెట్టుకున్న కళ్ళజోడు మరీ నచ్చింది. అలాంటివి మద్రాసులో తప్ప మనకెక్కడ దొరుకుతాయిలే అనుకున్నాడు.

మరికొన్నాళ్లకి ‘భలే రాముడు’ వచ్చింది. నాగేశ్వరరావు నల్లకళ్ళద్దాలు బాలరాజుకి మరీ నచ్చాయి. పార్వతీపురం టౌన్ జగన్నాథ రథయాత్ర లో ఒడియావాళ్ళ దుకాణంలో అచ్చంగా అలాంటివే కనిపించాయట, కాకపోతే ప్లాస్టిక్ వి. వాటిని బాలరాజు పావలాపెట్టి కొన్నాడట. రాంభట్లవాళ్ళ స్టూడియోలో ఫొటో తీయించుకున్నాడట. అగ్రహారం వీధి రామ్మందిరం లో ఆ ఫొటో చాలాకాలం ఉండేది. ఆ మందిరం అన్నా, అందులో నిలువెత్తు రాములవారి విగ్రహం అన్నా బాలరాజుకి ఎంత భక్తో! బెలగాం సెంటర్లో స్టేషనరీ దుకాణం నడిపే బొందిలీ భరత్‌సింగ్ కుటుంబం ఆ మందిరంలో రోజూ దీపం పెట్టేవాళ్ళు.