పేపర్లో ఆ వార్త చదివిన బుద్ధేశ్వర్రావుకి గుండెజారి గల్లంతైపోయింది. ఖర్చులు తడిసిమోపెడైపోయాయని బాధపడుతుంటే పులిమీదపుట్రలా కరెంటుఛార్జీల పెంపా? అని తెగ ఇదైపోయాడు. అత్యవసర సమావేశంపెట్టి ఇంట్లో ఎమర్జెన్సీ డిక్లేర్‌ చేశాడు. ఫ్యాన్ల జులాయి తిరుగుళ్ళు, పచ్చడినూర్పిళ్ళపై కఠిన ఉత్తర్వులు జారీచేశాడు. పడక ఏర్పాట్లన్నీ మార్చేశాడు. పర్యవసానం ఏమైందంటే....

పేపర్లో ఆవార్త చదవగానే బుద్ధేశ్వర్రావు గుండెజారి, జావగారి, ఓవర్‌ ఫ్లో అయి, నాలుగు కవాటాలకి పైపూత పూసింది.అసలే బుద్ధేశ్వరావుది చిన్న ఉద్యోగం. సంపాదన గోచికిపెద్దా, తువ్వాలుకిచిన్నా. తప్పనిసరి అవసరాలు, తప్పించుకోలేని ఖర్చులు, తడిసిమోపెడై, అరేస్తే డబుల్‌కాట్‌ బెడ్‌షీట్‌ అంత అవుతాయి.బుద్ధేశ్వరావు పిసినారేగానీ పొదుపరి. అనవసరఖర్చుకి ఆమడదూరముంటాడు. పదిపైసలు లాభం ఉంటే, పదడుగులు ముందుంటాడు.పేపర్లోపడ్డ ‘రెండువందల ఒకటి’ సంఖ్య పగబట్టిన పాములా బుసకొట్టింది. చావుబాజాలా వినబడింది. సప్తకట్ల పల్లకీలా కనబడింది.మళ్ళీమళ్ళీ పేపరు చదివాడు. తను చదివిందీ, అర్థం చేసుకున్నదీ కరెక్టే.కరంటు టారిఫ్‌ సున్నానుంచి రెండువందల యూనిట్లవరకూ, యూనిట్‌కి ఐదురూపాయలు. రెండువందలఒకటి నుంచి మూడువందలవరకు ఏడురూపాయల ఇరవైపైసలు.

మూడు వందలఒకటి నుంచి నాలుగొందలవరకు ఎనిమిదిరూపాయల యాభైపైసలు...అయ్యబాబోయ్‌! అనుకుంటూ పాత కరంటుబిల్లులు తీసి చూశాడు. తన ఇంట్లో కరంటు వాడకం ప్రతినెలా ఇంచుమించు మూడువందల యూనిట్లనుంచి నాలుగొందల యూనిట్ల వరకు ఉంది. పాత యూనిట్లని కొత్తరేట్లతో లెక్కకట్టాడు. గుండె లబ్‌డబ్‌ అనడంమానేసి లబోదిబోమంది.‘కొత్తరేట్లు వచ్చేనెల ఒకటోతారీఖునుంచి అమలు. కాలూ,చేయీ కూడదీసుకునేందుకు టైములేదు. వెంటనే ఎమర్జెన్సీ డిక్లేర్‌చేసి, కరెంటువాడకంలో కొన్నికోతలు, మరికొన్ని మార్పులు చేయకపోతే జేబుకిచిల్లు ఖాయం’ అనుకుంటూ ఆలోచించి ఆలోచించి, ఇక చించలేక, ఇంట్లో ఉన్న నలుగురితో ఎమర్జెన్సీ మీటింగ్‌ ఏర్పాటుచేశాడు బుద్ధేశ్వరరావు.తను అధ్యక్షస్థానంలో కూర్చున్నాడు. ఎనిమిదవక్లాసు చదువుతున్న కొడుకుని, వచ్చేఏడు ఏడోక్లాసు చదివేస్తానని బెదిరిస్తున్న కూతుర్ని, మిత్రపక్షాల్లా పక్కనే కూర్చోపెట్టుకున్నాడు. ఎదురుగా తల్లీ, భార్య సుగుణ ప్రతిపక్షాల్లా కూర్చున్నారు.

విషయంఏమిటో తెలియకపోయినా మీటింగ్‌ మొదలవ్వకుండానే చెప్పబోయేదాన్ని ఎలా ఖండించాలా అని అత్తా, కోడళ్ళు గుసగుసలు మొదలెట్టారు.‘‘కరెంటురేట్లు పెరిగిపోయిన కారణంగా మనఇంట్లో ఎమర్జన్సీ డిక్లేర్‌ చేస్తున్నా. ఈరోజు నుంచే మన ఇంట్లో రాత్రి తొమ్మిదిగంటలనుంచి ‘బ్లాక్‌ డే’. పిల్లలూ మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచి చదివి నన్నూ, బ్రహ్మగార్నీ ఉద్దరించక్కర్లేదు. పగటిచదువు కంటికి, ఒంటికి మంచిది. తేడాపాడాలొస్తే తాటతీస్తా. సమయానుకూలంగా ఇంకా కొత్తకొత్త రూల్సు వస్తాయి. యుద్ధప్రాతిపదికమీద సైనికుల్లా అమలుపరచడానికి సిద్ధంగా ఉండండి. ఇంతటితో మీటింగ్‌ సమాప్తం. రాత్రి తొమ్మిదైంది బుద్ధిగా పడుకోండి’’ అంటూ లైట్లన్నీ ఆర్పేశాడు.