చాలా ఆనందంగా ఉంది విష్ణువర్ధన్‌కి.భాషకందని భావోద్వేగం. తన మనసునేదో అదృశ్యహస్తం చక్కిలిగింతలు పెడుతున్నట్టు వర్ణనాతీతమైన ఆనందం.అమెరికాలో బయలుదేరిన క్షణంనుంచి మొదలైంది. భారతదేశం చేరుకోబోతున్నాననే భావనే ఒక అవ్యక్తానుభూతి. తెలుగురాష్ట్రానికి గుండెసవ్వడిలాంటి విజయవాడకి చేరుతున్న క్షణంలో పదింతలైన ఆనందాతిశయం.

ఎన్నిజ్ఞాపకాలో, ఎన్నెన్ని మధురానుభూతులో. కళ్ళముందు వేలాదిసంఘటనలు, సన్నివేశాలు, మాంటేజ్‌ షాట్స్‌లా కదులుతూ ఉంటే, తన గుండెసవ్వడి తనకే విన్సెంట్‌ టేలర్‌ మ్యూజిక్‌లా ధ్వనిస్తోంది.రిక్షాలోవెళ్తే చాలాసమయం పడుతుందని తెలిసినా, బెజవాడగాలి పీల్చుకుంటూ, తీరిగ్గా ఆ పరిసరాలన్నీ గమనిస్తూ, తన జ్ఞాపకాలతో సమన్వయం చేసుకుంటూ, ఆస్వాదిస్తూ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు.రిక్షా ఎక్కికూర్చున్న క్షణంనుంచీ, గాలి మరింత జోరుగా వీస్తుంటే, ఒక పారవశ్యం. పుట్టి పెరిగిందీ, బ్రతుకును చదివిందీ కృష్ణమ్మ ఒడిలోనే. దూరంగా కనకదుర్గమ్మ గుడి గోపురం కనిపించగానే, భక్తిశ్రద్ధలతో నమస్కరించి, నగరంలోంచి వెళ్ళేలోగా తప్పకుండా దర్శనం చేసుకుంటాను తల్లీ అని మనసులోనే అనుకున్నాడు.

తను వెళ్ళేది గణపతిశాస్త్రిని కలవడానికి. తను వస్తున్నట్లు అతనికి తెలియదు. కలుస్తాడో కలవడో? ఇంట్లో ఉంటాడో లేదో? తను ఈదేశం వదిలిపెట్టి పద్నాలుగు సంవత్సరాలైంది. కలుసుకోవాల్సినవాళ్ళు ఇంకా అనేకమంది ఉన్నారు. చైతన్య, అభిషేకం, దుర్గారావు, పవన్‌, మార్కండేయులు...చాలామంది, నాలుగైదు వీధుల్లో ఉండే జానకిరాం, దినేష్‌, సరస్వతి, స్వాతి, జోగి, మధు, ఆలీ, చంద్రి. వీళ్ళంతా తనలాగే సాఫ్ట్‌వేర్‌ పక్షులై విదేశాలకు ఎగిరిపోయారు.ఎవరిని కలిసినా కలవకపోయినా, ఒక్క గణపతిని మాత్రం తప్పనిసరిగా కలవాలి.

అదే తన ప్రధానమైన లక్ష్యం. గణపతిశాస్త్రి తన జీవితంలో ఒక మరపురాని అపురూపమైన వ్యక్తి.అసలేమిటీ జీవితం? పుట్టడం, బోర్లాపడటం, పాకడం, అడుగులు వెయ్యడం, మాట్లాడటం నేర్చుకోవడం, చదువుకోవడం, నేర్చుకున్నవిద్యని ఉపయోగించి నాలుగురాళ్ళు సంపాదించ టం, పెళ్ళి చేసుకోవటం, పిల్లలు, వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు, వృద్ధాప్యం, వీలుంటే ఆస్తులు సమకూర్చుకోవటం, భూమిమీద నూకలు చెల్లిపోగానే వెళ్ళిపోవటం. ఇంతేనా జీవితం?