ధనుర్మాసం మొదటి రోజు. ఊరి జనమంతా పెద్దాయన అని ఆప్యాయంగా, గౌరవంగా పిలుచుకునే సూరిబాబుగారు కొబ్బరికాయ కొట్టి, దేవుడి పల్లకీ ఒక పక్క కాసి రెండు అడుగులు వేసాక మరొకరు అంది పుచ్చుకున్నారు. ఊరేగింపు మొదలైంది. చాలా ఊళ్ళలో లాగా తోపుడు బండి మీదో, రిక్షా మీదో దేవుడిని ఊరేగిస్తూ పక్కన పూజారి నడవడం కాదు పల్లకీ అంటే. రెండు కళ్ళూ చాలవు ఆ అలంకరణ, ఆ వైభోగం చూడాలంటే!

కాటను సుధాకరు కూడా కొద్దిసేపు పల్లకీ మోసాడు. అతను ఆ రోజు ఉదయమే ఊళ్ళో దిగాడు. పోయేవరకు వాళ్ళ నాన్న పత్తి వ్యాపారం చేసేవాడు. చిన్నపుడు బళ్ళో పంతులుగారు మీ నాన్న ఏం పని చేస్తార్రా అనడిగితే సుధాకరు కాటన్‌ బిజినెస్‌ అని చెప్పాడు. ఓహో పత్తి వ్యాపారమా అన్నాడాయన. ఊళ్ళో సుధాకరు పేరు మరో ఇద్దరికి ఉండడంతో అప్పటినుండి నేస్తులు అతడిని కాటను సుధాకరు అనే పిలుస్తారు.‘‘ఏం సుధాకరూ ఎప్పుడొచ్చా?’’ అని చాలామంది పలకరించారు.ఊళ్ళో అన్ని వీధులూ తిరిగి కానుకలు పుచ్చుకుంటూ ఆశీర్వాదమిస్తూ దేవుడి పల్లకీ ఆనవాయితీ ప్రకారం వాడ మొదట్లోకి వచ్చి ఆగిపోయింది. వాడ జనమంతా వచ్చి దణ్ణాలు పెట్టుకుని ప్రసాదం పుచ్చుకొని వెళిపోయారు.

వాళ్ళలో రాజు కూడా ఉన్నాడు.‘‘ఉద్యోగం హైదరాబాదు లోనేనా’’ రాజు ప్రసాదం పుచ్చుకునేటపుడు పూజారి గారు అడిగారు. అవునన్నట్టు తలూపాడు.‘‘జీతం ఎంతేంటి?’’‘‘యాభై వేలు.’’‘‘అబ్బో, పెద్ద ఉద్యోగమే!’’ఫఫఫవయసును బట్టో, ఆస్తిని బట్టో సూరిబాబుగారు ఊరికి పెద్దాయన అవలేదు. సర్పంచ్‌గా మూడోసారి చెయ్యనంటే చెయ్యనని భీష్మించుకుని కూర్చున్నాడు. పదవి స్త్రీలకి కేటాయిస్తే భార్యనో, కోడళ్ళనో నిలబెట్టలేదు. దళితులకి కేటాయిస్తే నచ్చినవాడిని కూర్చోబెట్టి పెత్తనం చలాయించలేదు.ఆయనకి పిల్లలు లేరు. తమ్ముడు, మరదలు చిన్న వయసులోనే కాలం చేస్తే వాళ్ళ పిల్లలిద్దరూ ఆయన చేతుల మీదే పెరిగారు. వాళ్ళు పెద్దయ్యేసరికి వాళ్ళ పొలాలు రెండింతలు చేసి అప్పజెప్పేసాడు.ఎవరేనా కుర్రాడు అగుపడి ‘‘మీరు నా చదువుకి సాయం చేసారు. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది పెద్దాయనా’’ అంటే ‘‘ఏమో నాయనా .. సంతోషం’’ అంటాడంతే.