‘ఆఫీసులో తనని వేధిస్తున్న అధికారిని చెప్పుతో సత్కరించిన మహిళ....’ అన్న హెడ్‌లైన్‌తో టి.వి.లో పదేపదే ప్రసారమవుతున్న ఆ వార్తనుచూసి ఒక్క సారిగా నవ్వింది హైందవి.అక్కడే సోఫాలో కూర్చుని జాజిపూలమాల అల్లుతున్న జాహ్నవి ‘‘ఎందుకే... ఆ నవ్వు?’’ అంటూ అడిగింది ఆసక్తిగా.అంతలోనే అలామారిన ఆమె వైఖరికి విస్తుపోతూ, గుత్తంగా కూర్చిన జాజిపూల మాలను చిన్నకత్తెరతో కత్తిరించి, ఓ ముక్క హైందవి తలలో తురిమి, తానూ అలంకరించుకుంది జాహ్నవి. అప్పుడప్పుడే సన్నసన్నగా విచ్చుకుంటున్న జాజుల సువాసన అందమైన ఆ సాయం సంధ్యను మరింత పరిమళభరితం చేస్తోంది.జాహ్నవి తన దృష్టిని టి.వి.కేసి మళ్లిస్తూ కిందన మళ్లీమళ్లీ స్ర్కోల్‌ అవుతున్న ఆ వార్తను చూసి 

‘‘ఇందులో నవ్వేందుకేముందే! స్ర్తీలు సమాజంలో ఇంతటి హీనస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడాల్సింది పోయి... అయినా ఆవిడెవరో మా బాగా బుద్ధి చెప్పిందిలే!’’ అంది కాస్త ఆశ్చర్యం, ఇంకాస్త సంతోషం కలగలిపి.ప్రస్తుతం తామున్న సమాజంలో ఉద్యోగస్తులైన ఆడవాళ్లు, తమపై అధి కారులు, సహోద్యోగుల వలన సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌కి గురవుతూ అంతులేని మానసిక వేదనకి లోనవుతున్నారన్న వార్తలు తరచుగా వింటూనే ఉన్నారు. ఎవరికీ చెప్పుకోలేని మూగబాధతో, పెదవి విప్పకుండా అలాంటి వికృతచేష్టలను భరించేవారు కొందరైతే... ధైర్యంతో తిరగబడి ఇందాక టి.వి.లో చూపించినట్లుగా వాళ్లకి బుద్ధి చెప్పే మహిళలు మరికొందరు.

చాలామంది కామాంధులు తమకున్న అధికార వనరులను దుర్వినియోగం చేస్తూ, స్ర్తీని భోగ్యవస్తువుగా భావించి ఇలాంటి అరాచకాలకు పాల్పడుతూనే ఉన్నారు. మీడియా తమ డేగ కన్నుతో ఇలాంటి ప్రబుద్ధులను పసిగట్టి, ఎండగడుతున్నా సరే, చేసేవాళ్లు చేస్తూనే ఉన్నారు.జాహ్నవి ఆలోచనలు ఇలా నేల జారిన పాదరసంలా చురుకుగా పరుగులు తీస్తూండగా అంది హైందవి. ‘‘నిజానికి నేను నవ్విన కారణం వేరు జానూ... నిజానికి తనని హెరాస్‌ చేసినవాడిని అంత ధైర్యంగా నాలుగు తన్నినందుకు ఆవిడ సాహసాన్ని అభినందించాలి. అదలా ఉంచితే ఇలా బయట ప్రపంచపు దృష్టిలోకి వస్తున్నది ఒక పార్శ్యం మాత్రమే... కాని, పబ్లిక్‌ప్లేసులలోనూ, ఇళ్లలోనూ ఇలాంటి భయంకర అనుభవాలను ఎదుర్కొంటున్న వారి సంగతేమిటి? వయసుతో సంబంధం లేకుండా చాలామంది స్ర్తీలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్య ఇది.