అమెరికా మనవడొస్తున్నాడని తెలిసి ఆ పది రోజులూ పది యుగాల్లా గడిపారు ఆ తాత బామ్మ. మనవడి ప్రవర్తనచూసి బామ్మ తెగ మురిసిపోతుంటే, తాతగారు మాత్రం వీడేంటి ఇలా తయారయ్యాడని తెగ బాధపడిపోతున్నారు. తన స్నేహితుడి మనవడికీ వీడికీ ఎంత తేడా? స్నేహితుడిముందు ఇక తన పరువేంగాను? అనుకున్నాడు ఆ తాత. ఇంతకీ ఆ మనవడు అంతపని ఏం చేశాడు?

‘‘ఎందుకో...? ఈ పరంధామయ్య పిల్లల జీవితాలతో ఆడుకుంటాడు. ఆ సాఫ్ట్‌వేర్‌ సంబంధం కాదని చిన్నపిల్లలకు తెలుగుపాఠాలు చెప్పుకునే మామూలు బడిపంతులుకు ఇచ్చి ఆ పిల్ల గొంతు కోస్తున్నాడు. అయినా అందరూ నాలాగ తెలివిగా ఆలోచించగలరా?’’ అని ప్రణవి పెళ్ళి పత్రిక చూసి మనసులోనే బాధపడుతున్నాడు పరంధామయ్య స్నేహితుడైన జానకి రామయ్య.‘‘అబ్బబ్బ...ఎన్నిసార్లు పిలవాలి? కాఫీ తీసుకోండి. మళ్ళీ చల్లారిందని వంకలు పెడతారు’’ భార్య వైదేహి పిలుపుతో ఆలోచనల్లోంచి బయటకువచ్చాడు జానకిరామయ్య. పడకకుర్చీలో విరామంగా పడుకున్న జానకిరామయ్య లేచి కూర్చుంటూ ‘‘ప్రణవికి పెళ్ళి కుదిరిందే’’ అన్నాడు వైదేహికి పత్రిక అందిస్తూ.

‘‘అలాగా? ఆ మాట కాస్త సంతోషంగా చెప్పొచ్చుగా’’ అని కాఫీ పక్కనున్న టేబుల్‌మీద పెట్టి పత్రిక అందుకుంది.‘‘ఎలా సంతోషపడమంటావ్‌? వాడు నా మాట వినకుండా ఆ బడి పంతులుకు ఇచ్చి చేస్తున్నాడు. ఆ పిల్ల గొంతు కోస్తున్నాడు’’ అన్నాడు కొంచెం ఆవేశంగా. ‘‘అవేం మాటలండీ? శుభమా అని పెళ్ళి చేస్తుంటే గొంతుకొయ్యటం అంటారు. అన్నయ్యగారు ఏంచేసినా ఆలోచించే చేస్తారు. అయినా మీరంటున్న సాఫ్ట్‌వేర్‌ సంబంధం ఆ పంకజం కొడుకేకదా?’’ అడిగింది వైదేహి పెళ్ళి పత్రికలోంచి తల తిప్పకుండా.

‘‘ఆఁ అదే! ఎంత మంచి సంబంధం. నెలకు రెండులక్షలు జీతం, హైదరాబాద్‌లో సొంత ఇల్లు. ఒక్కడే కొడుకు ఇంకేం కావాలి?’’ అన్నాడు. ‘‘ఆ ఆ కావలిసినన్ని చెడుతిరుగుళ్ళు కూడా ఉన్నాయి’’ దెప్పింది వైదేహి. ‘‘ఈ కాలంలో ఎవరికిలేవు? పెళ్ళి చేస్తే అన్నీ సరిపోతాయి’’ అన్నాడు తన మాటలు సమర్థించుకుంటూ. ‘‘మరి మన శ్రావణిని అడిగినప్పుడు ఎందుకు కాదన్నారు?’’.