చూపుమరల్చలేని గొప్ప అందగత్తె ఆమె. సన్మానాలు పొందే గొప్ప కవి అతను. ఏ.సీ బోగీలో, ఎదురెదురు బెర్తుల్లో వారి ప్రయాణం. అతడితో మాట కలిపేందుకు తహతహలాడిందామె. ముగ్ధుడైపోయాడతను. చిరునవ్వులూ, ఉప్మా షేరింగులూ, భుజాలు, చేతివేళ్ళ టచ్చింగులూ, పక్కనే ఆనుకుని కూర్చునే అదృష్టం...ఓహ్‌! ఆమెవైపు నుంచి అన్నీ డబలోకే. ఇక టాప్‌ గేర్‌ పడటమే ఆలస్యం! వాళ్ళిద్దరి ప్రయాణం కలిసి ముందుకు సాగిందా?

రైలు కదులుతూ ఉండగా ఎక్కి, వీడ్కోలు చెప్పడానికి వచ్చిన అందరివైపు చిరునవ్వుతో చూస్తూ చెయ్యి ఊపి, తాపీగావెళ్ళి సీట్లో కూర్చున్నాడు శర్మ.జేబులోంచి మొబైల్‌ తీసి, హైదరాబాద్‌లో ఉన్న భార్యకు కనెక్టయి ‘‘సభ అయిపోయింది, ట్రైన్‌ ఎక్కాను, బయలుదేరింది, వచ్చేస్తున్నా’’ పొడిపొడిగా చెప్పాడు.‘‘ఓ కాయో పండో ఇచ్చి, ఓ శాలువాగుడ్డకప్పి పంపేశారా లేక ఏవన్నా సంభావన ముట్టజెప్పి చచ్చారా?’’ పాతికేళ్ళక్రితం తాళికట్టిన అతడి ధర్మపత్ని గొంతు ఖంగుమంది. ‘ఎదుటివాళ్ళు చూపించే ఆత్మీయ అనురాగ గౌరవ ప్రపత్తుల ముందు, లోటు లేకుండా రోజు గడిచిపోయే తనలాంటి వాళ్ళకు ఆ ముట్ట చెప్పే డబ్బు ఏపాటిది’ అనిపించింది శర్మకి. అయినా ఆమె స్వభావం తెలిసినవాడు కనుక తేలిగ్గా నవ్వేసి ‘‘ఇచ్చార్లే’’ అని, మాట మార్చేందుకు ‘‘తెల్లారేక ఆరు, ఆరున్నరకి హైదరాబాద్‌ వచ్చేస్తుంది ట్రైను’’ అన్నాడు.‘‘లేదండీ, ఆ ట్రైను ఎప్పుడూ లేటే. ఎనిమిదిన్నర తొమ్మిదిలోపు వెళితే గొప్పే’’ తియ్యని వీణానాదం లాంటి స్వరం వినిపించడంతో చటుక్కున తలెత్తి చూశాడు.

ఎదురుగా ఉన్న సీట్లో, తన కవిత్వంలోని ఊహా సుందరిని మించిన ముగ్థమోహనరూపం! కమ్మెచ్చు తీసినట్టున్న చక్కటి శరీరశిల్పం, జిగిబిగి కలిగిన సువర్ణ శరీరఛాయతో పాతిక కంటే ఒకటీరెండేళ్ళు తక్కువ వయసున్న సుందరి. సంప్రదాయ వస్త్రధారణ, ముఖంలో నిర్మలత్వం, చూపులో సంస్కారం...రెప్ప వాల్చడానికి కష్టపడ్డాడు శర్మ. అవతల లైన్లో ఉన్న భార్యతో, ‘‘సరే, మళ్ళీ ఫోన్‌ చేస్తాలే, రైలు శబ్దాల్లో వినిపించడం లేదు’’ అని, ఫోన్‌ కట్‌చేశాడు.

గొంతు సవరించుకుని ‘‘హైదరాబాద్‌ చేరేసరికి అంతలేటవుతుందా?’’ అన్నాడు ఆ సుందరితో.‘‘ఔనండీ, ఈమధ్య మూడు నాలుగుసార్లు ఇదే ట్రైన్లో హైదరాబాద్‌ వెళ్ళాను. ఎప్పుడూ లేటే. ఓసారి మరీ పదిన్నరకెళ్ళింది’’ తనకు తెలిసిన విషయం చెప్పడానికి ఎంతో ఉత్సాహం, తన పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తున్న ధోరణి ఆమె మాటల్లో కనిపించింది శర్మకి. ఇంకా ప్రశ్నించి ఆమెచేత ఏదైనా మాట్లాడించాలని లోలోపల కుతూహలం చెలరేగింది. ఏమడగాలో గబుక్కున తోచలేదు. దాంతో మౌనంగా చూపుమరల్చి బ్యాగ్‌లోంచి ఈరోజు జరిగిన సభ తాలూకు సమాజంవారు విడుదల చేసిన సావనీర్‌ పేజీలు యాంత్రికంగా తిరగెయ్యసాగాడు.