అప్పుడే ఫ్లైట్‌ దిగిన రమేష్‌, శ్రీలత ముందుగానే బుక్‌ చేసుకున్న కాబ్‌లో తాజ్‌ బంజారాకు వెడుతుంటే రమేష్‌ మళ్ళీ అన్నాడు. ‘‘ఏంటో శ్రీ....అప్పటికప్పుడు హడావిడిగా లాక్కొచ్చేశావ్‌. నీ పిచ్చి నీదేగానీ అసలావిడ ఎలా ఉంటుందో, అసలుందో లేదో...’’ అంటున్న రమేష్‌ మాటల్ని మధ్యలోనే అడ్డుకుంది శ్రీలత. ‘‘ప్లీజ్‌ రామ్‌....’’ అంది అతని చేతిమీద చెయ్యివేసి ఇంక మాట్లాడవద్దన్నట్టు. శ్రీలత పడుతున్న మానసిక సంఘర్షణ చూస్తున్న రామ్‌ మరింక మాట్లాడలేదు.

శ్రీలత తండ్రి రఘునాథరావు నలభైయేళ్ళ క్రితమే అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు. ఆయన అందరిలాగా పై చదువుల కోసమో, ఉద్యోగం కోసమో అమెరికా వెళ్ళలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో ఉండలేక వెళ్ళిపోయాడని చెప్పొచ్చు. ఆ రోజుల్లో ఎమ్మెస్సీ పాసైన మంచి కుటుంబంలోని అబ్బాయికి వచ్చినట్టే ఎన్నో సంప్రదాయ కుటంబాల నుంచి పెళ్ళి సంబంధాలు వచ్చాయి రఘునాథరావుకి. కుటుంబ నేపథ్యం, జాతకాలు, సంప్రదాయం అన్నీ చూసి తల్లిదండ్రులు అతనికి మీనాక్షినిచ్చి పెళ్ళిచేశారు.

అప్పటిరోజుల్లో కన్నతండ్రిని ఎదిరించలేని రఘునాథరావు కన్నతండ్రి గౌరవం కాపాడేందుకు మౌనంగా మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమెతో కాపురం చెయ్యలేకపోయాడు. ఎందుకంటే, రఘునాథరావు అప్పటికే రేణుకను ఇష్టపడ్డాడు. వేరేకులం కావచ్చుగానీ, అతని మనసునిండా ఆమే ఉంది. అందుకే పైచదువుల వంకపెట్టి అమెరికా బయలుదేరాడు. తనకోసం ఎదురుచూడవద్దని మీనాక్షికి ఒక ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడు. దుడుకుతనంతో కొడుకు చేసిన ఈ పనికి నలుగురిలో అవమానం పాలైన రఘునాథరావు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. అంతే! ఇరవైయేళ్ళు కూడా నిండని మీనాక్షి తిరిగి పుట్టింటికి చేరింది. అనూహ్యమైన ఈ సంఘటనతో రఘునాథరావుకి భారతదేశంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి.