ఉన్న ఊరూ, కన్నతల్లి ఒకటే. మనం ఎంతదూరం పరుగులు తీసినా ఆ కన్నతల్లి ఒడిలో ఒక్కసారైనా సేదదీరాల్సిందే. ఈ కథల్లో కూడా అతను చాలాకాలం తర్వాత సొంతూరు వెళ్ళాడు. అవే మొండిగోడలు, అవే మోడువారిన మొహాలు...కానీ ప్రతిసారిలానే అతనిలో సరికొత్త అనుభూతి! ఈసారి మాత్రం అతనికి, అతనివెంట వచ్చిన భార్యకు కూడా ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయంటే....

ఐదేళ్ళ తరువాత ఆ ఊర్లో కాలుమోపిన చంద్రానికి అంతా కొత్తగా కనిపించింది. వాస్తవానికి ఆ బస్టాండ్‌లో అప్పటికీ ఇప్పటికీ పెద్దమార్పులేమీ లేవు. ఊర్లో ఉన్న రెండు సినిమాహాళ్ళ పోస్టర్లు పోటాపోటీగా ఒకదాని పక్కన ఒకటి వెలిగిపోతున్నాయి. టీ బంకులో పాత సినిమా పాటల బదులు అర్థంకాని కొత్తపాటల శబ్దాలు. కట్టినపూలు అమ్ముతున్న ఇద్దరు ఆడవాళ్ళలో వయసు మీదపడ్డా వాళ్ళ నోట్లో నానుతున్న వక్కాకు పండిన గొంతులో ‘‘మూర రూపాయి మల్లెపూలు, కనకాంబరాలు’’ అంటూ అవే స్వరాలు. ‘‘బిస్కెట్‌ – పిప్పరమెంట్లు –నిమ్మొప్పులు’’ అరుస్తున్న బాషా... కాదు, వాడి కొడుకేమో! దుమ్ముకొట్టుకుపోయిన కుక్కలు, పందులు, గాడిదలు, వట్టిపోయిన పశువుల జనసంచారము. బస్సులురాక అట్టేలేక ఈసురోమంటుంది. అది అక్కడ సర్వసాధారణ చిత్రం. అయినా చంద్రానికి వింతగానే ఉంది. ఆనందంగా ఉంది. చిన్నప్పుడు మొదటిసారి బడినుంచి ఇంటికొచ్చి అమ్మ ఒడిలోకి చేరినంత కొత్త అనుభూతులతో కొత్త అందాలతో కంటికి వెలుగుల్నీ, చల్లదనాన్నీ ఇచ్చాయి.‘‘ఓయ్‌! చంద్రం’’ అన్న పిలుపుతో అటు చూసింది తులసి.

తన పక్కనున్న భార్యని కూడా మర్చిపోయి కలయచూస్తున్నాడు చంద్రం.‘‘ఓయ్‌ చంద్రం...’’ స్వరం పెంచి పిలిచాడు చలపతి.‘‘ఏమండీ...చలపతిసారు’’ చంద్రాన్ని చెయ్యిపట్టి లాగింది.‘‘ఏమిటీ, అంత పరధ్యానంగా చూస్తున్నావు.’’ అంటూ సూట్‌కేస్‌ అందుకున్నాడు చలపతి.‘‘ఊరిని.’’‘‘కొత్తేముంది. అవే మొండిగోడలు. మోడువారిన మనుషులు.’’చంద్రానికి ఆ మొండిగోడలే వెండికొండల్లా, మోడువారిన మొహాలే వెలిగిపోతున్న జ్యోతుల్లా కనిపిస్తున్నాయి. ‘‘రోజూ చూసే నీకు వీటిలోని అందాలు కనిపించకపోవచ్చు. ఎన్నాళ్ళకో ఒకసారి వచ్చే తిరనాల్లా ఉంది నాకు’’ అన్నాడు చంద్రం.‘‘సర్లే పద!’’ అంటూ దారితీసిన చలపతికి ‘‘సా... ఇట్లీండి పెట్టె’’ అంటూ వచ్చాడు ఓ పాతికేళ్ళ మనిషి. నిక్కరు పైన చొక్కా... తలకు టవల్‌తో కనిపించాడా యువకుడు.