వేసవిలో ఎండలు, వర్షాకాలంలో వానలు కురవాలి, శరదృతువులో ప్రకృతి శోభాయమానమవ్వాలి, శిశిరంలో ఆకులురాలి, వసంతంలో మళ్ళీ చిగురించాలి. ప్రకృతిలో ఈ సమతౌల్యం లోపించకుండా ఉండాలంటే ఋతువులు కాలంమాట వినాలి. ఆ తరహాలోనే పిల్లలుకూడా తల్లిదండ్రులమాట వినాలి. ఇందులో మొదటిది ప్రకృతిధర్మ. రెండోది తరతరాలనాటి ధర్మం. కానీ ఈకథలో అసలేం జరిగిందంటే....

‘ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీతొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది’పాతకాలం నాటి వాల్వు రేడియో ఇంకా పని చేస్తున్నట్టుంది. ఐతే అది పాతరేడియో కాదు. పై డబ్బా మాత్రమే పాతది. అందులో కొన్ని ఎలక్ట్రానిక్‌ భాగాలుమాత్రం పనిచేయనిస్థితిలో ఇంకా అలాగే ఉన్నాయి. వాటిమధ్య కొంత ఖాళీ ఏర్పరచి ఆ స్థలంలో ఒక చిన్న ఐపాడ్‌ అమర్చి అందులోనుంచి పాటలు వింటున్నాడు యాభైఏళ్ళ ద్వారకానాథ్‌. అదోరకమైన తృప్తి. తాతలకాలంనాటి వస్తువును ఇంకా భద్రంగా ఉంచుకుని అది పనికిరాకున్నా, పని చేయకున్నా, ఆ రూపంలో పనిచేస్తోందన్న అనుభూతి పొందుతున్నాడతను.ఆ పాటలోనిభావం మనసును కదిలించేసింది. తొందరపాటు కేవలం మనుషులకేకాదు పశుపక్ష్యాదులకు కూడా ఉంటాయని నిరూపిస్తోందా పాట.

అంతేకాక మనుషుల్లాగే అవికూడా ఏమరపాటుకు గురౌతాయన్నదే ఆ పాటలోని నిగూడార్థం అనిపిస్తోంది.ఆ రేడియోను చూస్తుంటే తన చిన్నతనం గుర్తుకొస్తుంది. ఒకప్పుడు బాగా పనిచేసిన రేడియోనే అది. తాతల కాలంనుంచీ ఇంట్లో ఉందది. తాతయ్య ఎప్పుడూ వివిద్భారతి ఎక్కువగా వినేవాళ్ళు. అందులోనూ రాత్రిపూట సిపాయిలకోసం తయారుచేసిన ప్రత్యేక పాటల కార్యక్రమం అంటే అతనికి ఎక్కడలేని ఆసక్తి. మధురమైన పాటలు ప్రసారమౌతాయి. అన్నీ హిందీపాటలే. అప్పటికాలంలో ఇంట్లో రేడియో ఉండాలంటే లైసెన్స్‌ తప్పనిసరి. వాల్వు రేడియో ఉన్నా ట్రాన్సిస్టర్‌ రేడియో ఉన్నా దేనికైనా లైసెన్స్‌ ఉండాల్సిందే.

వాల్వు రేడియోలకు ఇంటిలోపలే యాంటీనా కూడా పెట్టేవాళ్ళు. పదేళ్ళక్రితం టీవీలకు కూడా యాంటీనాలుండేవి. ఇప్పుడంతా టెక్నాలజీ వృద్ధి చెందింది. లోకం చిన్నదైపోయింది. లోకంతోపాటే మనుషుల మనసులు, మానవసంబంధాలుకూడా కుంచించుకుపోయాయి. తలతిప్పి ఎటుచూసినా ప్రతివాళ్ళూ ఎంతోబిజీగా సెల్‌ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఎదురుగా ఉన్న మనుషులతో మాట్లాడే తీరిక, అలాంటి సంస్కృతి లేదిప్పుడు. ఆలోచిస్తూపోతే అంతు అనేదే ఉండదు, మనసును పిండే బాధతప్ప. తన తండ్రి అమెరికాలో ఉన్నాడు. తన కొడుకుకూడా అమెరికాలోనే ఉన్నాడు. తను మాత్రం ఇండియాలోనే ఉండిపోయాడు.