అతడితో సహజీవనం చేస్తోంది ఆమె. అతణ్ణి పెళ్ళి ఒప్పించాలని శతవిధాల యత్నిస్తోంది. ఎప్పటికప్పుడు చాలా ఒడుపుగా కోరికలు తీర్చుకోవడంతప్ప పెళ్ళికి మాత్రం ఒప్పుకోవడంలేదు. అతడి మొదటిభార్య కూడా చెప్పిచూసింది!! అయినా ససేమిరా అంటున్నాడు. సిసలైన భార్యాభర్తల మధ్య ఉంపుడుగత్తెగా మిగిలిపోయిన భావనకు గురవుతోంది ఆమె. పులిమీద పుట్రలా అంతలోనే ఆమెకు.....

సరళ అయోమయంగా చూసింది.తన భర్త ఏం మాట్లాడతాడో ఆమెకు ఎన్నడూ అర్థం కాదు. అతడిని తన భర్త అనకూడదేమో! అవును. ఇంకా నూటికి నూరుశాతం తనకు భర్తకాదు. ‘‘మనం పెళ్ళి చేసుకుందాం!’’ అని గతరాత్రే అడిగింది సరళ. ఆరునెలలనుంచీ ఆమె పెళ్ళిగురించి పోరుపెడుతూనే ఉంది. కాని ప్రసాదరావే ఒప్పుకోవడం లేదు. రాత్రికూడా అలాగే అన్నాడు.‘ఎందుకంతగా తినేస్తావు! ఇప్పుడు మనకి పెళ్ళితంతు అంత అవసరమా?’ అన్నాడు ప్రసాదరావు.‘‘ఆరునెలైంది, నన్ను పెళ్ళి చేసుకుంటానన్నావు కాబట్టే నీతో సహజీవనానికి ఒప్పుకున్నాను. ఏ రోజు కారోజు వాయిదావేస్తూ పోతున్నావు!’’ అంది సరళ.‘అతడితో కలిసి బతకడానికి ఒప్పుకుని తాను తప్పు చేయలేదుకదా! తాను ఎందువల్ల అంత తొందరపాటు నిర్ణయం తీసుకుంది!’ లోపల్లోపల ఆమెకు సంకోచంగానే ఉంది.సరళను తనవైపు తిప్పుకున్నాడు ప్రసాదరావు. ఆమె అయిష్టత ప్రదర్శించింది.

అయినా అంత సులువుగా ఒప్పుకునేరకం కాదు. కానీ లైంగికవాంఛ తీర్చుకోవడంలో అతడు ప్రదర్శించే ఒడుపే వేరు. పావుగంట తర్వాత ఆమె నీళ్ళగదికి పోయివచ్చింది.‘‘పశుబలం ప్రదర్శించడం గొప్ప అనుకుంటున్నావు!’’ ఆక్షేపించింది సరళ. నిజానికి అతడు పసికట్టింది ఆమె బలహీనతనే. అతడితో సుఖపడటంలో ఆమె వెనుకంజ వేయదు.ఆమె చెక్కిళ్ళు సుతారంగానొక్కి వదిలిపెట్టాడు.‘‘నేనంటే నీకు ప్రాణం కదూ!’’ అన్నాడు ఆమె కురులు సవరిస్తూ.‘‘పెళ్ళి సంగతి మాట్లాడవేం?’’ అడిగింది సరళ అతడి నుండి విడిగా జరిగి.‘‘నా మీద నీకు నమ్మకం లేదా?’’‘‘నమ్మకం తగ్గిపోతోంది’’‘‘ఒక్కమాట చెప్పు సరళా! ఇప్పుడు మనం పెళ్ళి చేసుకోవడం అంత ముఖ్యమా? చేసుకుని ఎవరిని నమ్మించాలి? ఎవరిని కలుపుకోవాలి?’’‘‘సమాజంలో మనకు గౌరవం అక్కర్లేదా?’’‘‘గౌరవం! ఇప్పుడు మనల్ని ఎవరు గౌరవించాలి? మనం ఎవరి నుండి మర్యాద ఆశించాలి? ఇప్పుడు పెళ్ళి చేసుకుని, ఇంతకాలం సహజీవనం చేశాం అని తెలియచెప్పాలా? ఇక ఇప్పటినుంచీ మనం కొత్తగా కనిపించాలా?’’