తాడినితన్నగల మనస్తత్వం ఆమెది. ఆమెతలదన్నేవాడు తారసపడలేదు. కౌటిల్యుడి కజిన్‌ సిస్టర్నని చెప్పుకుంటుంది. పెద్ద నెరజాణ! చిన్న చిన్న విషయాలన్నీ ఆమే చూసుకుంటుంది. అందుకే ఇంతవరకు ఒక్క పెద్దవిషయం కూడా ఆమె భర్త దృష్టికిరాలేదు! ఇప్పుడు ఆడబిడ్డ పెళ్ళిబాధ్యత భుజాలకెత్తుకుంది ఆమె. లక్షణమైనవాడు, విశ్వాసంగా పడుండేవాడు కావాలి! వెతుకుతోంది. అలాంటివాడు దొరికాడా? దొరికితే ఏం జరిగింది?

శకుంతలాదేవి చాలా తెలివిగలది. అల్లాంటి ఇల్లాంటి అల్లాటప్పా తెలివికాదు. ఎంతటివాళ్ళనైనా, ఇట్టేబుట్టలో పెట్టేసుకోగలదు. ఎవరితో, ఎప్పుడు, ఎలా ఎంతవరకు డీల్‌ చెయ్యాలో ఆమెకు ‘బట్టర్‌’తో పెట్టినవిద్య. పాచికలువెయ్యటంలో శకునిస్వయానా ‘మా చిన్నాన్నే’ అంటుంది. ఎత్తుకు పైఎత్తులువేసి కార్యం సాధించటంలో ‘నేను కౌటిల్యుడి కజిన్‌ సిస్టర్ని’ అంటుంది.ఆమె హోమ్‌సైన్స్‌ చదివింది. మొగుణ్ణి ‘హోమ్‌ సైలెన్స్‌’లో పెట్టేసింది. చిన్నచిన్న విషయాలన్నీ ఆమెకు వదిలేశాడు. ఆయన పట్టించుకోవల్సిన పెద్దపెద్ద విషయాలేవీ ఇంతవరకూ ఆయనదృష్టికి రాలేదు! అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలో శకుంతల ఎప్పుడూ అడిగినవాళ్లకీ, అడగనివాళ్లకీ చెబుతూ ఉంటుంది. ఆలుమగలు శబ్దార్థాల్లా ఉండాలంటుంది. అంటే ఏమిటోగూడా విపులంగా బనానా ఒలిచి మౌత్‌లో పెట్టినట్టు చెబుతుంది.

భార్య పర్మిషన్‌ లేకుండా భర్త ఎవరికి ఎన్ని వాగ్దానాలుచేసినా, అవన్నీ ఒట్టి ‘అర్థంలేని శబ్దాలే’ అంటుంది. ‘వాక్‌దానాలే’ అంటుంది. భర్త తెచ్చి ఇచ్చే జీతంగీతం, ఆస్తిపాస్తులు, స్థిరచరాస్తుల అమాంబాపతుఅంతా, భార్యకు శబ్దంలేని ‘అర్థం’ కిందకి వస్తాయంటుంది. అదీ భార్యాభర్తలు శబార్థాల్లా ఉండటం అంటే! అయ్యా లేక అమ్మా అదీ విషయం.ఇప్పుడు ఆమె తక్షణ కర్తవ్యం ఏమిటంటే, తమదగ్గరే ఉన్న ఆడబిడ్డ లావణ్యకు, అన్యోన్యంగా, కుక్కకన్నా ఎక్కువ విశ్వాసంగా ఉండేవాడిని వెతికి వాడిచేత మూడుముళ్లు వేయించటం. కుర్రాడు చూడటానికి చాకులా ఉండాలి. మాంఛిప్రాపర్టీ ఉండాలి. గీసినగీటు దాటకుండా పడుండాలి. అల్లాంటివాడు తమచేత పావలా ఖర్చు చేయించకుండా పెళ్ళి చేసుకోవాలి.

ఇది ఈరోజుల్లో సాధ్యమా అంటే, ‘నేను కౌటిల్యుడి కజిన్‌ సిస్టర్నికదా, ఒక ఫార్ములా కని పెట్టానులెండి’ అంటుంది.ఇక మన బంగారం, లావణ్య విషయానికొస్తే, విగ్రహపుష్టి. ఇంగ్లీషులో బాగావీక్‌. అంటే తెలుగులో పండిట్టా ‘అంటే’ వచ్చీరానట్లు మాట్లాడుతుంది. వచ్చీరానీ మాట ఊరీఊరని ఊరగాయ అన్నారు మరి. నవ్వు మాత్రం మన్మథుని పువ్వే. దానితోనే నరుక్కురావాలని మన కజిన్‌ సిస్టర్‌ ప్లాన్‌. ఇదివరలో కొన్ని సంబంధాలు చూసిందిగానీ అంటనప్పుడు ఒంటినిండా ఆముదం రాసుకున్నా అంటదు.