ఉదయం ఆరున్నరైంది.పక్కమీంచి లేచి వరండాలోకి వచ్చేసరికి మా వీధి వీధంతా ఏదో అలజడిగా, ఆందోళనగా ఉందనిపించింది. మేం ఉండేది డాబా పైభాగంలోనే కాబట్టి, వరండాలో నాలుగడుగులు వేసి, వీధి చివరకు చూశాను. ఆ దుకాణం ముందు జనం గుంపుగా ఉన్నారు. అక్కడ జనం గుంపుగా ఉండటం ఎప్పుడూ కనిపించే దృశ్యమే అయినా ఏదో జరిగిందనిపించింది.

పనిపిల్ల ఇంకా రాలేదు. తొమ్మిదింపావుకల్లా ఎలాంటి పరిస్థితిలోనూ నేను ఆఫీసుకు బయలుదేరిపోవాలి. హడావుడిగా నిత్యకర్మల్లో నిమగ్నమయ్యాను.శ్రీమతి పుట్టింటికి వెళ్ళి నెలరోజులు పైనే అయింది. మరో నెలరోజుల్లో నానిగాడికి చెల్లెల్నో, తమ్ముడినో జన్మనిస్తుంది. ఆపై మూడు నెలలకుగానీ ఆవిడ ఇంట్లో అడుగుపెట్టదు. అప్పటివరకూ నా పాట్లు నేను పడకుండా పద్దూని అప్పగించి వెళ్ళింది. పద్దూ పూర్తి పేరు పద్మ. బొద్దుగా ఉంటుంది. బొద్దుగా ఉన్నా చలాకీగా పనిచేస్తుంది. పదమూడేళ్ళు. ఈడేరిన వయస్సే. మున్సిపల్‌ స్కూల్లో తొమ్మిది చదువుతోంది. పద్దూ మా ఇంట్లో వంటపని, ఇంటి పని చకచకా చేస్తుంది. క్రిందకు వెళ్ళి యజమాని కుళాయిలోంచి మూడు బిందెలనీళ్ళు పట్టి తెస్తుంది.

కుక్కర్‌ పెట్టి ఇంత అన్నం ఉడకబెట్టి ఫ్రిజ్‌లో ఏ కూరగాయలో ఉంటే కూర కూడా చేసి పెడుతుంది. నేను క్యారేజీ సర్దుకుని నిశ్చింతగా ఆఫీసుకు వెళ్తాను. తను పని పూర్తి చేసుకుని స్కూలుకు వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు పద్దూ తల్లి మంగమ్మ ఐదేళ్ళ కొడుకుని వెంటబెట్టుకొని పనిలోకొస్తుంది. మనిషి వంగిపోయి ముక్కుతూ, మూలుగుతూ పనిచేస్తుంది. మంగమ్మది పెద్ద వయస్సు కాదు.‘‘ఎందుకు మంగమ్మా? అలా వంగిపోయి నడుస్తావ్‌?’’ అని ఒకసారి అడిగితే