స్కూల్లో స్నేహితులు ఆమెను శివంగి అనేవారు. ఎందుకంటే అంతలా చెలరేగిపోయేది. మాట పడేదికాదు. ఎంతటివారినైనా ఎదిరించేది. టికెట్టు ఇస్తూ తనచేతిని నలిపేశాడని కండక్టర్‌ చెంపచెళ్లుమనిపించింది. పెద్దయ్యాక మెడలో తాళిబొట్టు పడింది. ఆమె జీవితం తారుమారైంది. రోజూ భర్త ఆమె చెంపలు చెళ్లుమనిపిస్తున్నాడు. సూటిపోటి మాటలంటున్నాడు. అప్పుడుకూడా ఆమె తిరగబడిందా? లేక సహించిందా?

 

‘‘చిట్టితల్లీ! ఊహా! ఈ మ్యాజిక్‌పెట్టె నీకోసమే తెచ్చానమ్మా’’ కూతురుకి అందమైన ఒక పెట్టె చూపిస్తూ చెప్పాడు తండ్రి.‘‘మ్యాజిక్‌పెట్టా?’’ఆశ్చర్యపోయింది ఊహా.‘‘అవునమ్మా! ఇది మ్యాజిక్‌పెట్టె. ఈపెట్టె ఉంటే మనచెంత ఉండదు ఏ చింత’’ అంటూ పెట్టె గొప్పతనం గురించి ఒక్కొక్కటిగా చెప్పసాగాడతడు. బుగ్గనచేయి వేసుకుని తండ్రి చెప్తున్న విషయాలన్నీ ఆసక్తిగా వింటోంది ఊహ.‘‘ఈపెట్టెనిండా అంతులేని ఆనందాలు, లెక్కలేనన్ని సంతోషాలు దాగున్నాయి. కొన్ని గాయాలు, మరికొన్ని బాధలు కూడా ఉన్నాయనుకో. సందర్భానుసారం అభిరుచిమేరకు ఏంకావాలో మనమే ఎంచుకోవచ్చు. ఉదాహరణకి గుండె పట్టనంత ఆనందక్షణాలు అనుభవంలోకి వచ్చినా తట్టుకోవడం కష్టం కదా!’’‘అవునా’ అన్నట్టు చూసింది ఊహ.

‘‘సరిగ్గా అప్పుడే మొహంమొత్తి రుచి మార్చాలనిపిస్తుంది. వెంటనే ఈమ్యాజిక్‌ పెట్టెలో చెయిపెట్టి ఓచెంచాడు బాధని తీసుకుంటే సరి. ఆకిక్కే వేరు. చిన్నపాటి నొప్పి కూడా లేకుండా హాయి రుచి తెలిసేదెలా? హఠాత్తుగా కాలికి దెబ్బతగిలి చిన్నగాయమై నెత్తురోడితే ‘జివ్వు’మనే సుఖమే వేరు....’’‘‘నాన్నా’’ అంది అప్పుడే ఆక్షణమే తన కాలికి దెబ్బతగిలిన బాధను కళ్ళతోనే అభినయిస్తూ ఊహ.‘‘బాధలు కూడా జీవితంలో భాగమేనమ్మా. వద్దన్నా అవి మనల్ని వెంటాడి వేధించకమానవు. అందుకే బాధల్లోనూ సుఖాన్ని వెతక్కోవడమే మందు. అలాంటి మందే ఈ మ్యాజిక్‌ పెట్టె మనకందిస్తుంది. నడుస్తున్నక్షణంలో ఎదురయ్యే అనుభవాల గాఢతని తట్టుకోలేమనిపించినప్పుడు ఇంకోటి మనం ఎంచుకునే సౌలభ్యం ఈపెట్టెద్వారా దక్కుతుందని చెప్తున్నా. నిజంగా నువ్వు బాధలో ఉన్నావనుకో, ఆ ఆవేదనతో మనసు నలిగిపోతోందనుకో అది మరచిపోయి నవ్యోత్సాహం పొందేందుకు ఈ మ్యాజిక్‌ పెట్టె ఎంతగానో ఉపకరిస్తుంది. బాధల అగాధంలో కూరుకుపోయినప్పుడు ఓగరిటెడు సంతోషాన్ని ఇదే పెట్టెలోంచి తోడుకోవచ్చు’’ అన్నాడతను చిన్నారి ఊహ భుజంతట్టి ధైర్యం చెప్తూ.