పవిత్రమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడతను. వ్యసనాలపుట్టగా మారాడు. పెళ్ళిచేసినా అతడిలో మార్పులేదు. శృతిమించి దొంగగా మారాడు. రాజభటులు తరిమితే దట్టమైన అరణ్యంలోకి పారిపోయాడు. అడవిలో పులి ఎదురైంది. అతడినేం చేయలేదు! కొండచిలువ అతడిపై పడింది. కానీ దారి మార్చుకుని వెళ్ళిపోయింది, పాము కూడా అతడిని కాటేయకుండా దూరంగా పారిపోయింది. చివరకు మునిశాపం కూడా అతడిమీద పనిచేయలేదు!! ఎందుకని?

*********************

మణిపురమనే నగరంలో కుముదుడనే బ్రాహ్మణుడుండేవాడు. లేక లేక పుట్టాడని తలిదండ్రులు అతణ్ణి గారాబంగా పెంచారు. అందువల్ల కుముదుడు చిన్నతనంనుంచీ చదువంటే శ్రద్ధ చూపక అల్లరిచిల్లరగా తయారయ్యాడు. వయసొచ్చేసరికి పూర్తిగా జూదగృహాల్లోనూ,వేశ్యామందిరాల్లోనూ గడపసాగాడు. అతణ్ణి మంచిదారిలో పెట్టడానికి తలిదండ్రులు ఎన్ని ప్రయత్నాలుచేసినా ప్రయోజనం లేకపోయింది. పెళ్ళిచేస్తే బాగుపడతాడన్న ఆశతో తలిదండ్రులు అతడికి సునంద అనే యువతితో పెళ్ళి జరిపించారు. కుముదుడి భార్య సునంద చూడచక్కనిది, గుణసంపన్నురాలు. భార్యపై మోజుకొద్దీ, కొత్తలో కుముదుడు ఇంటిపట్టునే ఉండేవాడు. ఆ మోజు తీరాక మళ్లీ ఎప్పటిలాగే బయటకువెళ్లడం మొదలెట్టాడు.కుముదుడి తలిదండ్రులకు బెంగపట్టుకుంది.

కొడుకు బాగుపడకపోవడమే కాక, వారి ఆస్తి కూడా తరిగిపోతున్నది. కూర్చుని తింటే, కొండలైనా తరిగిపోతాయి. కుముదుడికి ఉన్న ఆస్తి కొండంతలేదు. ఆ దిగులుతో తలిదండ్రులు మంచానపడ్డారు. అలా కుముదుడు ఇంటికి యజమాని అయ్యేసరికి అతడికిక పట్టపగ్గాలు లేకుండాపోయాయి. తలిదండ్రుల వైద్యంగురించి కూడా పట్టించుకోకుండా, మిగిలిన ఆస్తిని విచ్చలవిడిగా ఖర్చుచేయసాగాడు. అలా కొన్నాళ్లకు కుముదుడి తలిదండ్రులు కన్ను మూశారు. అప్పటినుంచీ సునందకు కష్టాలు ప్రారంభమయ్యాయి.కుముదుడికి సంపాదనలేదు. చేతిలో ఉన్నదంతా ఖర్చుపెట్టడం ఒక్కటే తెలుసు.

తండ్రి ఎలా సంపాదించేవాడో ఎన్నడూ పట్టించుకోలేదు. ఇంట్లోనిరొక్కమంతా అయిపోగానే చేతికందిన వస్తువునల్లా తెగనమ్మసాగాడు. ముందు నగలతో మొదలెట్టాడు. తర్వాత బట్టలు. ఆతర్వాత వంటసామగ్రి. ఇక అమ్మడానికి ఏమీ లేకపోయేసరికి, ఇల్లు అమ్మేశాడు. అలా ఆ దంపతులు రాజభవనంలాంటి స్వంతిల్లు వదిలి, చిన్న అద్దెకొంపలోకి మారారు. అయినా, కుముదుడి పద్దతి మారలేదు. వీలైనంతవరకూ అప్పులుచేసి తన సరదాలు తీర్చుకునేవాడు. కానీ, ఆస్తిపాస్తులేమీ లేకపోవడంతో, క్రమంగా అతడికి అప్పులిచ్చేవాళ్లు తగ్గిపోయారు.