కొడుకు అమెరికానుంచి మూటాముల్లె సర్దుకుని వచ్చేస్తున్నాడని తెలియగానే సత్యమూర్తి ముందు ఆందోళనచెందినా తర్వాత మెల్లగా తేరుకున్నాడు. ఇన్నేళ్ళూ అతనక్కడ సుఖంగానే గడిపి ఉండొచ్చుగానీ ఇక్కడ తనూ సరస్వతీ ఇంట్లో మరోమనిషి తోడులేక, ఏదో జీవించాలి కాబట్టి ఇంతవరకు కాలంగడుపుతూ వచ్చారు. కొడుకు ఇప్పటికైనా వెనక్కి వస్తున్నాడు. రావడమేకాదు ఉద్యోగం కూడా ఈ ఊళ్లోనే వెతుక్కున్నాడు. కాబట్టి తమతో కలిసి ఉంటాడు. ఇది తలుచుకున్నప్పుడల్లా సత్యమూర్తి ఆనందంతో పొంగిపోతున్నాడు.

సరస్వతి పరిస్థితే అటూఇటూగా ఉంది. కొడుకు సంగతి సరే. కోడలికి ఈ వాతావరణం నచ్చు తుందా? పెళ్ళయ్యాక రెండుసార్లువచ్చి పదేసిరోజులుండి వెళ్ళిందిగానీ ఏకంగా ఈసారి ఇక్కడే స్థిరపడిపోవడానికి వస్తోంది మరి. ఈ ఇల్లు నచ్చుతుందో, నచ్చదో, వేరు కాపురం పెడతా నంటుందేమో? అయితే ఆమెగానీ, కొడుకుగానీ తమకి వేరే ఇల్లు చూడమని సూచనాప్రాయంగా నైనా చెప్పలేదు కాబట్టి ఇక్కడే ఉంటారనుకోవాలి.వాళ్లొచ్చేలోపు ఇంటి పరిస్థితిని చక్కదిద్దాలనుకుంది సరస్వతి. ఇంతకాలం తను, భర్త ఇద్దరే కాబట్టి ఎలాఉన్నా సర్దుకుపోయేవారు. కొడుకు, కోడలు వచ్చేది అమెరికానుంచాయే. అక్కడ లాగా ఇక్కడ వసతులు లేకపోయినా కనీస అవసరాలైనా సమకూర్చకపోతే తను భయ పడినట్టుగానే కోడలు వేరుకాపురం పెడతానంటుందేమో!ముందుగా తాము వాడుకుంటున్న మాస్టర్‌బెడ్రూమ్‌ను ఖాళీచేయించింది సరస్వతి.

బాత్రూములో ‘వెస్ట్రన్‌ కమోడ్లు, షవర్స్‌’ ఏర్పాటు చేయించింది. గదిలో వాళ్ళసామాన్లు పెట్టుకోవడానికి అల్మారాలు, గూళ్ళు ఖాళీ చేయించింది. అయితే అవి చాలవు. పక్కగదిలో రెండు చెక్కబీరువాలున్నాయి. అవి ఖాళీచేయిస్తే బాగానే ఉంటుందిగానీ, వాటిల్లో ఆమె మావగారు ఇష్టపడి దాచుకున్న పుస్తకాలున్నాయి.మావగారు పోతూపోతూ ఈ ఇల్లూ, గోదావరినదికి చేరువలో ఒక ఎకరంపొలం ఇవ్వడమేకాదు, ఈ రెండుబీరువాలల్లో పుస్తకాలను కూడా కొడుక్కి ఆస్తిగా ఇచ్చిపోయారు.తనైతే ఎప్పుడూ ఆ బీరువాలజోలికి వెళ్ళలేదుగానీ తన భర్తే అప్పుడప్పుడు ఒక్కోపుస్తకాన్నీ తీసి శుభ్రపరిచి వాటిల్లో పెడుతూ ఉంటాడు. అంతేగానీ అతగాడుకూడా వాటిని ఏనాడూ చదివిన పాపాన పోలేదు.