చుట్టూ చప్పట్లు, అభినందనలు. అతడు లక్ష్యం సాధించిన మాట నిజమే. కానీ ఇంకా పరిపూర్ణత చేకూరలేదు. ఏదో లోటు. నిన్ను నిన్నుగా ప్రేమించగల స్ర్తీ సహచర్యం లభిస్తేనే జీవితం ఆనందమయం అనే భావన కలిగిందో లేదో అతడి మనసులో అలేఖ్య రూపం మెదిలింది. ఆమె ఎక్కడుందో, ఏమైపోయిందో. కానీ ఆమె కోసమే అతడి అన్వేషణ, ఎదురుచూపులు. ఆమె దొరికిందా? వాళ్ళు కలుసుకున్నారా?

అది సిటీలోనే పెద్ద పేరున్న ఫైవ్‌స్టార్‌ హోటల్‌. అక్కడ ఒక పార్టీ జరుగుతోంది. అది నాకోసమే. టెన్నిస్‌ ఆటలో నాకు ఒలంపిక్స్‌ గోల్డ్‌ మెడల్‌ వచ్చిన సందర్భంగా భారీగా జరుగుతున్న పార్టీ. ప్రముఖులంతా అక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా వచ్చారు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఫ్యాషన్‌ నగల ధగధగలు, మ్యూజిక్‌ ఒకపక్క, అన్నిదేశాల వంటలు ఇంకోపక్క. నేను సాధించిన విజయానికి అందరు వచ్చి నన్ను అభినందిస్తున్నారు. సాధించినది చిన్న విజయం కాదు. నా ఆశయం నెరవేరింది, కానీ ఏదో తెలియని వెలితి నా మనసును కుదిపేస్తోంది.

ఇంతమంది చుట్టూ ఉన్నా నేను ఒంటరినే అన్న భావన నన్ను ఆ పార్టీని ఎంజాయ్‌ చెయ్యనివ్వడం లేదు. గోల్డ్‌మెడల్‌ పొందాలని నా మనసు, శరీరం ఇన్నాళ్ళుగా పడిన తపన తీరిందిగానీ, నాలో ఇంకా ఈ విజయం పరిపూర్ణం కాలేదన్న భావనే ఉంది. ఎలాగో పార్టీ పూర్తయ్యేవరకు ముళ్ళమీద ఉన్నట్టు ఉండి అయిపోయిన వెంటనే బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నాను.కార్‌ డోర్‌ తెరిచాను. డ్రైవర్‌ రాంబాబు నిద్రపోతున్నట్టున్నాడు. మ్యూజిక్‌ ప్లే అవుతోంది.

‘‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు తోడొకరుండిన అదే భాగ్యము... అదే స్వర్గము...’’ నేను కార్లో కూర్చున్న శబ్దానికి రాంబాబు లేచాడు. ‘‘సారీ విభవ్‌బాబు కునుకు పట్టేసింది’’ అన్నాడు.‘‘పర్వాలేదులే రాంబాబు’’ నేను వచ్చినప్పటినుంచి రెస్ట్‌ లేకుండా తిరుగుతున్నావు.కార్‌ స్టార్ట్‌ చేసి పాట మార్చబోయాడు.‘‘ఉండనీ రాంబాబు పాట బావుంది’’ అన్నాను.ఆ పాట వింటుంటే కవి ఎంత బాగా చెప్పాడో కదా అనిపించింది. నా మనసులో ఉన్న భావనకు ఒక రూపం ఇచ్చే విధంగా ఉంది ఆ పాట. నేను సాధించిన విజయాన్ని అక్కడ అందరూ అభినందించారు. కానీ నేను ఆ విజయం సాధించడానికి పడిన కష్టం, తపన అక్కడున్న ఎవరికీ తెలియదు. అది తెలిసిన వాళ్ళతో ఆ అనుభవాలను పంచుకుంటేనే నా విజయానికి పరిపూర్ణత.