వెంకటపతి ఉలిక్కిపడి లేచాడు. అరకిలోమీటరు దూరంలోంచి గోదావరిగర్జన వినబడుతోంది.కొన్నిరోజులుగా పశ్చిమాన కొండకోనల్లో ఎడతెరిపిలేని కుంభవృష్టి కురుస్తోంది. నురగలు కక్కుతూ ఎగిసిన గోదారి సముద్రంవైపు పరుగులు తీస్తోంది. దారిపొడుగునా విధ్వంసం సృష్టిస్తూ ఎఱ్ఱటి నీరు ఉగ్రరూప నాట్యం చేస్తోంది.

ఇంటి తలుపులు తీసి బయటికి వచ్చాడు వెంకటపతి. సిటీలో పీ.జీ చదువుతున్నాడు. మెయిన్‌ సబ్జెక్ట్‌ ఫైనాన్స్‌. దసరా సెలవలకి వచ్చాడు. సమయం దొరికినప్పుడు నది ఒడ్డుకువచ్చి కూర్చుంటాడు. దూరంగా తెల్లటి కొంగలు బారులు తీర్చిపోతూ ఉంటాయి. తెరచాపలు ఎత్తి పడవలు సాగిపోతూ ఉంటాయి. కెరటాలతో ఆటలాడే తెల్లటి వెండి వెలుగులు, చేపలగుంపులు–కొంగలగుంపులకి దీటుగా నీటిలో ఎగురుతూ ఉంటాయి. గోదారినది ఒడ్డున ఎంతసేపున్నా, ఆ దృశ్యాన్ని ఎంతసేపు చూసినా విసుగురాదు. ధ్యానంలో దొరికే ప్రశాంతత ఇక్కడికి వస్తే దొరుకుతుంది.నిన్నటివరకు కొద్దిగా వచ్చిన నీరు హఠాత్తుగా పోటెత్తింది.

సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉంది నదీమతల్లి. రాత్రి నిద్రపోయే సమయానికి ఆందోళన ఏమీలేదు. ఇప్పుడు హోరు భయంకరంగా మారింది.సన్యాసి రామయ్యకి వెంకటపతి ఏకైక సంతానం. రామయ్యకి కోనసీమ డెల్టాలో ఇరవైఒక్క ఎకరా కొబ్బరితోట ఉంది. కొబ్బరి పట్టుబడి, కురిడీలు ప్రాసెస్‌ చేసే పాకలు పెరట్లో ఉన్నాయి. రాక్షసి బొగ్గు గుట్టలు, ఆ పక్కన పెద్ద కొండల్లా పెరిగిన కొబ్బరి డొక్కలు.సన్యాసి రామయ్యకి నాగపూర్‌వారి విదర్భ కోకోనట్‌ కంపెనీతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి.ఈ మధ్యన కొబ్బరికి తెగులు పుట్టింది. నున్నగా ఉండే కొబ్బరికాయలకు ముళ్లముచ్చు తెగులువచ్చి కాయసైజు తగ్గింది. కొబ్బరిపంటకి పర్యవేక్షణ అక్కరలేదు. నీరుపెట్టినా, పెట్టకపోయినా కొబ్బరి కాస్తుంది. పెద్దగా పట్టించుకోలేదు సన్యాసి రామయ్య. మామూలు దిగుబడి వస్తూనే ఉంది, వ్యాపారం జరుగుతూనే ఉంది.