అటవీప్రాంతంలోని తన స్వగ్రామంలో మిత్రులతో కలిసి బాబా ఆలయనిర్మాణానికి పూనుకున్నాడు అతను. వర్ఛస్సు ఉట్టిపడే అద్భుతమైన పాలరాతి విగ్రహరూపకల్పనకు ఉత్తమోత్తముడైన శిల్పికోసం, అంతగొప్ప పాలరాయి కోసం అన్వేషణ ప్రారంభించి చివరకు రాజస్థాన్‌లోని రాంఘర్‌ చేరుకున్నాడు. అక్కడి అనుభవాలు అతడికి భాషకు అందని పారవశ్యం కలిగించాయి. అంతకుమించిన భావోద్వేగానికి గురిచేశాయి. ఏమిటా అనుభవాలు?

.....................................

‘తేజస్సు–వర్ఛస్సు’...‘ఈ రెండూ ఒకటేనా?’ రామక్రిష్ణ చాలాసేపటినుండి ఆలోచిస్తున్నాడు ఆ చెట్టుకింద కూర్చుని. తదేకంగా అతని ఎదుట ఓ పదడుగుల దూరంలో ఉన్న ఆ మక్రానా పాలరాతి బండవైపు చూస్తూ, ఎండాకాలం...తెల్లవారి నాలుగ్గంటలైందేమో, అప్పటిదాకా చల్లగా హాయిగొల్పుతూ, స్పర్శిస్తూ వెళ్తూన్న గాలి మెల్లగా వేడెక్కడం తెలుస్తూనే ఉంది. రాజస్థాన్‌లో ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంటుందని విన్నాడు తను. కాని ఇంత భయంకరంగా ఉంటుందనుకోలేదు. గత ఐదారునెలలుగా ఈ రాజస్థాన్‌ మక్రానా పాలరాతి గనుల్లోకి వస్తూ పోతూ... ఇదో వ్యాపకమైపోయింది తనకు. ఎప్పుడైతే తన ఊరు గోవిందరావుపేటలో తనూ, తన మిత్రులూ నిర్మించతలపెట్టిన సాయిబాబా దేవాలయపనులు ప్రారంభించారో, అప్పటినుండే తను ఇలా రాజస్థాన్‌ బాట పట్టాడు. మక్రానా పాలరాయికి ప్రసిద్ధి చెందింది నాగూర్‌జిల్లా. ఆ జిల్లాలో డూంగ్రీ, మోర్వాడ్‌ తదితర మారుమూల ప్రాంతాలన్నీ వెదికివెదికి చివరికి మోర్వాడ్‌ దగ్గర రాంఘర్‌ గ్రామం చేరుకున్నాడు తను. అక్కడి శిల్పి పూలన్‌సింగ్‌ రథియా. అతడు పాలరాయితో సాయిబాబా విగ్రహాన్ని చెక్కడంలో, నిర్మించివ్వడంలో ఘనాపాటి.

మశూర్‌ అతన్ని వెదకి పట్టుకున్నాడు. తనూ తన ఇంకో ఇద్దరు మిత్రులు శ్రీనివాస్‌, సిద్ధినాయుడు అతడి శిల్పాశ్రమానికి చేరుకున్నాం.తాము ముగ్గురూ చిన్నప్పటినుంచీ క్లాస్‌మేట్స్‌. తమ ఊరు గోవిందరావుపేట. మహదేవ్‌పూర్‌ అడవుల్లో ఉంటుంది. సాయిబాబా దేవాలయం నిర్మిద్దామని తను ప్రతిపాదించగానే, ఊళ్ళో ఒక నిశ్శబ్ద ఆనందసముద్రం పొంగి వెల్లువెత్తుతుంది. ఊరి జనమంతా తలాకొంతా ప్రోగేసి ఊరు నడిబొడ్డున ఓ లక్షరూపాయలతో అర ఎకరం స్థలం సమకూర్చారు.ఇక ఆలయ నిర్మాణమే తరువాయి. తనే ఒక ఆలోచనను విసిరాడు జనంలోకి. ప్రధాన ఆలయగర్భమైన మూలవిరాట్టు సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని... ఆ ప్రధాన పరివేష్టిత నిర్మాణాన్ని తను అనగా ఎం.రామక్రిష్ణ పూర్తిగా తన స్వంత ఖర్చులతో సమకూరుస్తాడు. దాతగా ఖర్చు అంచనా దాదాపు పదిలక్షలు అవుతుందన్నారు అందరూ. దానికి కుడిఎడమల ప్రక్కనున్నస్థలంలో హరిహర దేవాలయాలు చిన్నవిగా నిర్మించినా వాటికయ్యే ఖర్చు ఒక్కోదానికి ఐదు లక్షలు. ఒకటి శ్రీనివాస్‌, మరొకటి సిద్ధినాయుడు సమకూర్చుతామన్నారు.