చిన్నప్పటి స్నేహితులువాళ్ళు. అతనొక్కడే మిగిలిన మిత్రులందరికీ దూరంగా ఉన్నాడు. వాళ్ళందరికీ అతడే హీరో. జీవితంలో అన్ని రకాలుగా ఎదిగినవాడు. అందరినీ కలుసుకోడానికి వస్తున్నట్టు ముందుగానే సమాచారమిచ్చాడతను. స్టేషన్‌కువెళ్ళి ఆదరంగా ఆహ్వానించి అతన్ని తీసుకెళ్ళారు మిత్రులంతా. ఆ పరిసరాలన్నీ తిరిగి మధురానుభూతులు నెమరేసుకున్నారు. కానీ తర్వాత....? తర్వాత అతడేం చేశాడు?

‘‘రేయ్‌!’’‘‘చెప్పరా?’’‘‘రేపొద్దున్నే మీముందు వాలిపోతాను. సత్తిగాడూ, భీముడూ, షరీఫ్‌గాడూ...’’ పాజ్‌ ఇచ్చాడు ధీరజ్‌.‘‘నాగ్గాడూ, పాణిగాడూ...’’ పూర్తి చేశాడు సారధి. అవతల ఫోన్లో హోరుమనే నవ్వు. సారధిలో ఉత్సాహం కెరటంలా ఎగదన్నుకొచ్చింది. కాసేపు ఇంకేదో పిచ్చాపాటి మాట్లాడి, సన్నగా హమ్‌ చేస్తూ కుర్చీలో కూలబడ్డాడు. ధీరజ్‌ ఫోన్‌కాల్‌ గొప్ప శక్తినిస్తోంది అతడికి. సంతకాల కోసం క్యాబిన్‌లోకి వెళ్ళాలా వద్దా అన్నట్టు సందేహంగా నిలబడిపోయారు బాస్‌ని గమనిస్తున్న స్టాఫ్‌.ఆ సాయంత్రం మిత్రబృందమంతా రాఘవయ్యపార్క్‌లో చేరిపోయారు. ధీరజ్‌ వస్తున్నాడంటే అందరికీ తన్మయం కలుగుతోంది. అంతగా ప్రభావితం చేయగలడతను. ఎవరింట్లో దిగాలో అని కాసేపు వాదించుకుని మళ్ళీ ధీరజ్‌కే ఫోన్‌ చేసి గెస్ట్‌హౌస్‌లో దిగుతాడని విని వాదన ఆపారు.

రేపటి కార్యక్రమం నిర్ణయించమని సారధికే పెద్దరికం అప్పగించి బయల్దేరారందరూ.‘‘పాపం ఈసారి భీమరాజు మిస్సవుతున్నాడ్రా. ఆపరేషన్‌ జరిగి ఎన్నో రోజులు కాలేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాడట’’ పాణి దిగులుపడ్డాడు. ‘‘నాగ్గాడూ అంతేకదా? వాడొచ్చాక అన్నీ ఆలోచిద్దాం. అసలువీడు ఎన్నిరోజులు గడపగలడో మనతో!’’ కారు దగ్గరకి నడిచి ‘‘రేపు స్టేషన్‌కి రండ్రా అందరూ’’ అన్నాడు సారధి. అంతా తలలూపి కదిలారు.ఉదయమే విజయవాడ ప్లాట్‌ఫాంమీద ప్రత్యక్షమైన స్నేహితులను పేరుపేరునా పలకరిస్తూ కౌగలించుకున్నాడు ధీరజ్‌. అందరూ ముందుగా గెస్ట్‌హౌస్‌కి దారితీశారు. కాసేపు సందడిచేసి బయటకొచ్చారు.అరేయ్‌ నువ్వేం మారలేదురా! అదే రూపం, అదే వేషధారణ, అవే మాటలు... సారధి నవ్వుతూ చూశాడు. అందరూ బాబాయ్‌ హోటల్‌ ముందు పిట్టల్లా వాలిపోయారు. వీళ్ళ అల్లరికీ, సందడికీ కాలేజీ స్టూడెంట్స్‌ గూడా సరిపోరని కౌంటర్‌ దగ్గరున్న బాబాయి వారసుడు అనుకున్నాడు. ఉప్మా పెసరట్లూ, ఇడ్లీలూ ఆప్యాయంగా తింటూ ఆస్వాదిస్తూ కాలేజీ రోజుల్ని తలచుకున్నారు.