కోపంగా లోపలికి వచ్చాడు రామనాథం. అప్పుడే ఈవినింగ్‌ వాక్‌ చేసి వస్తున్నాడు. పైగా లిఫ్ట్‌ పనిచేయకపోవడంతో, మెట్లెక్కివచ్చాడు. దాంతో ఆయాసపడుతున్నాడు. కానీ అతడి కోపానికి ఆయాసమో, లిఫ్ట్‌ పనిచేయకపోవడమో కారణం కాదు. విషయం వేరే ఉంది. కోపానికి అతడికళ్ళు ఎర్రబడకపోయినా మొహంలో మాత్రం చిరాకు తెలుస్తూనే ఉంది. అలాగే వచ్చి భార్య సత్యవతి పక్కన సోఫాలో కూలబడ్డాడు. అప్పటికే ఆమె కాఫీ తాగుతూ టీవీ చూస్తోంది. భర్తని మాత్రం పట్టించుకోలేదు. దాంతో ఇంకాస్త చిరాకు పెరిగింది రామనాథానికి. ఇక ఉండలేక, ‘‘నాకు కోపంగా ఉంది’’ అన్నాడు భార్య వైపు చూస్తూ.

‘‘ఎందుకు నేను కాఫీ కలుపుకుని మీకు కలపలేదేమో అనా? మీకూ కలిపాను. అదిగో మీ ఎదురుగానే టీపాయిమీద ఉంది చూడండి’’ భర్తవైపు చూడకుండానే సమాధానం చెప్పింది సత్యవతి. రామనాథం టీపాయివైపు చూశాడు. టీపాయి మీద కప్పులో కాఫీ పొగలు కక్కుతోంది.‘‘నేను కోపంగా ఉందని చెప్పింది కాఫీ కోసం కాదు, పార్వతీశం నన్ను వెక్కిరించినందుకు’’ అన్నాడు. ఈసారి కొంచెం స్వరం పెంచుతూ.‘‘ఎప్పుడో పదిహేను రోజులక్రితం వెక్కిరించినదానికి ఇప్పుడు కోపమా?’’ భర్తవైపు తిరిగింది అంది సత్యవతి.‘‘అప్పటి సంగతి కాదు. ఇది కొత్తది. ఇందాక వస్తుంటే మెట్లమీద మళ్ళీ వెక్కిరించాడు’’.

‘‘ఏమన్నాడు?’’‘‘మొన్న కూసిందే మళ్ళీ కూశాడు. ‘రామనాథంగారూ, మీరు రిటైరయ్యాక ముసలివారైపోయారండీ... కనీసం ఫస్ట్‌ఫ్లోరు మెట్లెక్కడానికి కూడా ఆయాసపడుతున్నారు’ అన్నాడు. అక్కడికి వాడేదో పడుచుపిల్లాడైనట్టు! అయినా వాకింగ్‌ చేసి వస్తే ఆ మాత్రం ఆయాసం రాదా’’.‘‘దానికి మీరేమన్నారు?’’‘‘అపార్ట్‌మెంట్‌కి సెక్రటరీగా నీ పని, నా గురించి ఆలోచించడం కాదు. లిప్ట్‌ గురించి ఆలోచించడం. ముందు దాని సంగతిచూడు. పనిచేయడం మానేసి నాలుగురోజులైందని చెప్పాను’’ అన్నాను.