మాట అనేది ఎంత పవర్‌ఫుల్లో ఉగ్గుపాలతో సినిమాలు చూస్తూ పెరిగి పెద్దయిన శ్రీపంచ్‌కి తెలుసు.మాట అనేది ఎలా కదిపేస్తుందో...కుదిపేస్తుందో ఛానల్‌ టీవీల్లో ఒక్కో అంశాన్నీ ఊదరగొట్టే విధానం చూసి అర్థం చేసుకున్నాడు. అందుకనే మాటలు ప్రయోగించాలో చిన్నప్పటి నుండీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గ్రామర్‌ తయారు చేసుకున్నాడు శ్రీపంచ్‌.మాటలతో చెడుగుడు ఆడడం అతడికిప్పుడు కరతలా మలకం.తనకి విలువొచ్చి తన రేంజ్‌ పెరగాలంటే సినిమాల్లో కెళ్ళడం ఒక్కటే మార్గం అని తెలుసుకుని, ఒక ఫైన్‌ డే తెనాలి నుండి హైద్రాబాద్‌ చేరుకున్నాడు. నానా కష్టాలుపడుతూ బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కృష్ణానగర్‌, ఫిల్మ్‌నగర్‌లలో తనకో అవకాశం ఇచ్చే వాళ్ళకోసం భూతద్దం పెట్టుకుని వెదకసాగాడు.

స్టూడియోల చుట్టూ తిరుగుతూ, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నిత్యం సంచరించే హోటల్లు, బార్లలో కాపు కాయసాగాడు.అతని టైం బాగుందో లేక ఆ యువ డైరెక్టర్‌ లక్కోగానీ మొత్తానికి వాళ్ళిద్దరి కలయికా ఆ బార్లో జరిగింది.‘‘ఫిలిమ్‌ ఇనిస్టిట్యూట్‌లో కోర్స్‌ చేసిన డైరెక్టర్ని నేను. నా దగ్గర సక్కటి కథుంది. ఐదేళ్ళ నుండీ ఒక్కొక్కడి ముడ్డెనక తిరిగీ తిరిగీ మొత్తానికి ఒక ప్రొడ్యూసర్ని ఒడిసి పట్టుకున్నా. ఆడు నా కథకి డబ్బులెట్టడానికి రెడీగా ఉన్నాడు.

కానీ ఇన్నాళ్ళూ మాటలు రాసేవాడే దొరకలేదు. ఆల్రెడీ ఫీల్డ్‌తో అనుభవం ఉన్నోళ్ళని పెట్టుకుందామంటే, అంతకుముందు ఉన్నోళ్ళు నాటకీయంగా రాశారు. ఇప్పుడున్నోళ్ళు పంచ్‌లమయంగా రాస్తున్నారు. నా కథకి ఓ ప్రెష్‌ డైలాగ్‌ రైటర్‌ కావాలి. సుడి అంటే ఇదే! ఇన్నాళ్ళకి నువ్వు దొరికావు. నేనూ కొత్తే. నువ్వూ కొత్తే, ప్రొడ్యూసరూ కొత్తే, దీనబ్బ! సినిమా కూడా కొత్తగా ఉండాల. ఇరగదియ్యాలి. ఇప్పుడసలే కొత్తోళ్ళు, లో బడ్జెట్‌ సినిమాల హవా నడుస్తోంది. వసూళ్ళలో పెద్ద సినిమాలతో సమానంగా పోటీ పడుతున్నాయి. తీయబోయే సినిమాతో మనం సెటిలైపోవాలి అంతే!’’ అన్నాడు ముందు ఫ్యూచర్‌ విజన్‌ ఇచ్చిన కిక్కుతో.