వేంకటేశ్వరస్వామి దర్శనార్థం గట్టు వద్దకు చేరేసరికి సాయంత్రం అయిదున్నర దాటింది. జనం చాలా పలచగా ఉన్నారు. రెండు జంటలు మెట్లు దిగుతున్నాయి. మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రసాదం ఆరగిస్తూ మెట్లమీద కూర్చుని ఉన్నారు. వాళ్ళను చూస్తూ పది మెట్లు గబగబా ఎక్కాను. కుడి పక్కన నీళ్ళపంపు కనిపించింది. వెళ్ళి నీళ్ళతో కాళ్ళు శుభ్రం చేసుకున్నాను. కళ్ళజోడు తీసి పైజేబులో పెట్టుకునే లోపల ఒక మెరుపు మెరిసినట్లైంది. నా చేతిలో కళ్ళజోడు లేదు. కిచకిచమని శబ్దమైతే అయోమయంగా పైకి చూశాను. కొమ్మమీద కూర్చుని ఉన్న కోతి చేతిలో నా కళ్ళజోడు ఉంది. ఎంత లాఘవంగా లాక్కుంది అని ఆశ్చర్యపోతూ కింకర్తవ్యం అని అనుకుంటుండగా... దేవుడిలా...ఇది దేవునిగుడేగా...అక్కడి స్టాఫ్‌ ఒకతను అక్కడకొచ్చి ‘‘కళ్ళజోడు కోతి ఎత్తుకుపోయిందా సార్‌? అయ్యయ్యో కొరుకుతుంది... ఉండండి చెబుతాను’’ అని అక్కడున్న పొడుగాటి కర్ర తీసుకుని పైకి ఎక్కుతున్నట్టు బెదిరించాడు.

చేతి నుండి జోడు వదిలేసింది కోతి. దానికోసమే సిద్ధంగా ఉన్నట్లు చేతిలో ఉన్న కర్రను వదిలేసి, జారిపడుతున్న జోడును జాగ్రత్తగా పట్టుకున్నాడు అతను. కృతజ్ఞతలు చెబుతూ పది రూపాయలు చేతిలో పెట్టాను. నవ్వుతూ తీసుకున్నాడు. అందరిలాంటివాడే ఇతడు కూడా! మామూలు మనిషే కదా అనిపించింది. వెంటనే అలా అనుకున్నందుకు సిగ్గుపడ్డాను. గుడిలోకి ప్రవేశించాను. పూజార్లు అప్పటికే అలసిపోయినట్లు కనిపించారు. ఇద్దరిలో ఒకరు ‘‘బాబూ రండి! గుడి తలుపులు మూసే టైమ్‌ అయింది. అర్చన ఏమన్నా చేయిస్తారా?’’ అని ప్రశ్నించాడు. తలూపాను ‘అష్టోతరం’ అని అంటూ. స్వామికి మనసారా నమస్కరించాను.

చాలా ఆకర్షణీయమైన విగ్రహం. అష్టోత్తరం అయిన తర్వాత మరో పూజారి హారతి ఇచ్చి తీర్థం ఇచ్చి శఠగోపం పెట్టారు.‘‘అయ్యా ఇటు చూడండి. మూలవిరాట్టు. ఈ స్వామి భక్తులకు కొంగుబంగారం. ఈ చుట్టుపక్కలే కాదు మన రెండు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తారిక్కడకి. మొక్కులు తీర్చుకుంటారు. ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడెవరూ రాత్రి నిద్ర చెయ్యరు. సూర్యాస్తమయం కాగానే గుడితలుపులు మూసివేసి అందరం కిందికి చేరు కోవాల్సిందే! అదే తిరుమలగిరి క్షేత్ర మహాత్మ్యం!’’ స్వామికి సాష్టాంగపడి ఆలయం బయటకు వచ్చి ప్రసాదం తీసుకుని ‘‘బాబూ ఇక్కడ గాయత్రి సత్రం ఎక్కడ’’ అని సెక్యూరిటీని అడిగాను. ‘‘గట్టు దిగి అలా పది నిమిషాలు నడిస్తే పెద్ద బంగళా వస్తుంది. అదే గాయత్రి సత్రం’’ అని జవాబు చెప్పాడు.