చింత చిగురు చూస్తే నోరూరే వయసులో, హరివిల్లును చూస్తే అబ్బురపడే మనసులో పుట్టెడు ఆలోచనలు బొమ్మలు గీసుకున్నాయి. రకరకాల రంగులు పూసుకున్నాయి. అవి కడుపు నింపుతాయో లేదో తెలీకపోయినా పొట్టిగిరి మనసును మాత్రం రంగులరాట్నంలో గిరగిరా తిప్పేశాయి.

అవి పిచికల గూళ్ళు కావు..ఇళ్ళే! బ్రిటిష్ కాలం నాటివి. ‘పోలీసు లైన్’ అనేవాళ్ళు. బెలగాంసెంటర్ కి ఉత్తరంగా, పార్వతీపురం టౌన్ వెళ్ళే తోవలో, మెయిన్ రోడ్డుకన్నా దిగువున, ఈ కొసన చర్చి మొదలుకుని ఆ కొసన బిసంకటక్ బంగ్లాదాకా, చక్రాలులేని రైలు పెట్టెల్లాగా ఉండేవవి. వాటిలో పదో నంబర్ ఇంట్లో ఉండేవాడు ఎలిశెట్టి శేషగిరి. పదిహేడేళ్ళు నిండినా ఇంకా ఫోర్త్ ఫారంలోనే ఉన్న శేషగిరిని స్నేహితులంతా పొట్టిగిరి అనేవాళ్ళు. వాడికి బొమ్మలే లోకం, రంగులే ప్రపంచం. ఖాళీగోడ కనిపిస్తేచాలు పొట్టి గిరి తనకన్నా పొడుగాటి బొమ్మల్ని వేసేవాడు.గిరి తండ్రి కానిస్టేబుల్ అప్పలస్వామికి ఈ గీతలూ, రంగులూ నచ్చేవి కావు. ఈ పొట్టోడు ఎప్పుడు పొడుగవుతాడో, ఎప్పుడు పదో తరగతి పాసవుతాడోనని ఆయనకి ఒకటే చింత! తను సర్వీసులో ఉండగానే వాణ్ణి బెలగాం డి.ఎస్.పి దొరగారి బంగ్లాలో కనీసం ఆర్దర్లీ ఉద్యోగంలోనైనా పడేయాలని అప్పలస్వామి తాపత్రయం.

దొరగారి కాళ్ళు పట్టుకుని అలాగే మొదటి ముగ్గురు కొడుకుల్నీ పోలీసు డిపార్ట్‌మెంటులోనే వేయించాడాయన. ఆఖరివాడే ఇంకా అందుకురాలేదు.గిరికి ఇవేవీ పట్టినట్లు లేదు. చిన్నపట్నుంచి వాడిది అదో ప్రపంచం. తమ క్వార్టర్స్ కి ఎదురుగా చింతచెట్లంటే గిరికి ఎంతో ఇష్టం. అవి చిగుళ్ళతో సింగారించుకున్నప్పుడు లేత కెంపు వన్నెల్ని ఒడిసిపట్టేవరకు గిరి నిద్రపోయేవాడు కాదు. అలాగే ఇంటి వెనక నెల్లి చెరువు గట్టుని దాటుకుని దూరంగా బోడికొండమీద హరివిల్లు పొడిచినప్పుడు ఏడు రంగుల సోయగాల్ని గోడమీదో కాయితమ్మీదో దించే వరకు విశ్రమించేవాడు కాదు. ఇంటికి దగర్లోనే బెలగాంహైస్కూల్. వాడు క్లాసులో ఎప్పుడూ చివరి వరసలోనే ఉండేవాడు. అసలే పోట్టివాడేమో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలిసేదికాదు.చిట్టచివర్న కూర్చొని, తొడమీద పుస్తకం పెట్టుకుని, ఎదురుగా పాఠాలు చెబుతున్న మాస్టార్ల భంగిమల్ని కుదురుగా దించేసేవాడు.

మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో ఎదురుగా ఉన్న ఇంటికి వెళ్ళకుండా హైస్కూలుకి ఐమూలగా బేసిక్ ట్రైనింగ్ స్కూలు పక్కనుంచి మున్సిఫ్ కోర్టువైపు వెళ్ళేవాడు. అక్కడ చింతచెట్లకింద రోడ్డుమీద బొమ్మల పిచ్చాడి రేఖావిన్యాసాలకు కళ్ళప్పగించేవాడు. సంజీవని పర్వతం ఎత్తుకుని గాల్లో ఎగిరే ఆంజనేయుడు, నాలుక భయంకరంగా చాపి పుర్రెల మాలను మెళ్ళో వేసుకున్న కాళిక అమ్మవారు లాంటివి చూసి గిరి చాలా నేర్చుకున్నాడు. బెలగాం హైస్కూల్ వార్షికోత్సవాల్లో ఏటా డ్రాయింగ్ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ ఎప్పుడూ పొట్టిగిరిని దాటిపోలేదు. అలాగే ఏటా డీఈఓ గారు తనిఖీ కి వచ్చినప్పుడు క్లాస్‌రూమ్‌ని ఆర్ట్ గ్యాలరీలాగా మార్చేసి సర్టిఫికెట్లు కూడా సంపాదించాడు. ఎటొచ్చీ, ఆక్సిజన్ ప్రయోగం బొమ్మని అద్భుతంగా వేసే పొట్టిగిరికి అందులో వాడే రసాయనాల పేర్లు మాత్రం తెలీదు.