పిల్లాడు స్కూలుకి, వాడి చెల్లెలు క్రష్‌కి, అమ్మానాన్నలిద్దరూ ఉద్యోగాలకి. ఇదే వాళ్ళ రొటీన్‌ జీవితం. కానీ ఆ రోజుమాత్రం పిల్లాడు స్కూలుకి రెడీఅవలేదు. ఏమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడు. అప్పటికేదో బలవంతంగా స్కూలుకి పంపారు. తర్వాత గట్టిగా ప్రశ్నిస్తేగానీ సమాధానం చెప్పలేదు. ఓస్‌ ఇంతేకదా అని చిటికెలో సమస్య పరిష్కరించింది తల్లి. కానీ సమస్య అప్పుడే మొదలైందని ఆ తల్లికి తెలియదు!!

‘‘ఏరా ఇంకా స్కూలుకు తయారవలేదు, ఆటో వచ్చే వేళైంది’’.నవీన్‌లో చలనంలేదు. కూర్చున్నచోటు నుంచి కదలలేదు. రోజూ ఈపాటికి స్కూల్‌బ్యాగ్‌ సర్దేసి తను ఇచ్చిన టిఫిన్‌బాక్స్‌ తీసుకుని స్కూలు యూనిఫాం వేసుకుని తయారుగాఉండే కొడుకు ఇవాళ స్తబ్ధుగా ఉండటం సుశీలను ఆశ్చర్యానికి గురిచేసింది.అయినా తల్లిగా తన బాధ్యత గుర్తొచ్చి ‘‘తొంద‍రగా తయారై స్కూలుకు వెళతావాలేదా?’’ గదమాయించింది.హాల్‌లో పేపర్‌ చదువుకుంటూ టీవీ చూస్తున్న సుధీర్‌ ఏమైందిరా స్కూల్లో ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు, స్కూలుకు ఫోన్‌ చేస్తాను?’’ అన్నాడు.నవీన్‌ చదివే స్కూలుకు ఆ ఊర్లో చాలా పేరున్నది. దాంట్లో సీటురావటం చాలా కష్టం. అందులో తమపిల్లల్ని చేరిస్తే, బొందితో కైలాసానికి వెళ్ళినంతగా సంబరపడిపోతారు తల్లిదండ్రులు. ఎందుకంటే ఆ స్కూల్లో చదివినవాళ్ళు అమెరికా వెళ్ళటం ఖాయం.‘‘వీడివాళ తయారయ్యేలా లేడు.

ఎంతసేపూ పేపర్‌ చదవటం, టీవీ చూడటంతప్పించి పిల్లవాడు ఏమవుతున్నాడో మీకనవసరం. అవతల నా ఆఫీసుకు టైమైపోతోంది. క్యారేజీలు సర్దాలి. బుజ్జిదాన్ని క్రష్‌లో దించాలి’’ భార్య బాధింపులతో ఇహలోకంలోకొచ్చిన సుధీర్‌ కొడుకుని బుజ్జగిస్తూ ‘‘ఏమిట్రా ఒంట్లో బాగాలేదా, లేక స్కూలుకు వెళ్ళాలని లేదా’’ అన్నాడు.మాట్లాడకుండా స్కూలుకు తయారయ్యాడు నవీన్‌. అమ్మయ్య అనుకున్నారు. భావిభారత పౌరుని మాతాపితలు.సాయంత్రం ఏడుగంటల సమయం.ఈసురోమంటూ తల్లిదండ్రులు, నిస్సత్తుగా పిల్లలూ ఇంటికి చేరుకున్నారు.సుశీల బట్టలు మార్చుకుని భర్తకు టీ అందించి, తను కూడా టీ కప్‌ తెచ్చుకుని ‘‘ఇవాళ ఏం చెప్పార్రా స్కూల్లో’’ అన్నది.‘‘.. ... ....... ’’‘‘ఏమైంది. నిన్నటినుంచి చూస్తున్నాను, ఉలుకుపలుకూ ఉండటంలేదు. స్కూల్లో ఏం జరిగింది అంటే చెప్పవు. ‘ఎవరైనా ఏమన్నా అన్నారా?’ అని అడుగుతుంటే మాట్లాడవు. ఉండు, రేపు నేనే మీ స్కూలుకు వచ్చి విషయం కనుక్కుంటాను.