‘‘నీ పేరు ప్రణవి కదూ!’’ అన్నాను ఏటిఎమ్‌ లైన్లో నా ముందు నిల్చున్న అమ్మాయిని పరిశీలనగా చూస్తూ ఇంకేవో ఛాయలను ఆమె ముఖంలో వెతుకుతూ. ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరమో, రెండవ సంవత్సరమో అనుకుంటాను. దేహంలో టీనేజ్‌ వన్నె తొంగి చూస్తోంది.‘‘నా పేరు ప్రణవి కాదంకుల్‌ ప్రణతి’’ అంది ఆ అమ్మాయి నన్ను ఎగాదిగా, కొత్తగా చూస్తూనే.

‘‘పోనీ మీ అక్క పేరు ప్రణవి కదూ!’’ అని మళ్ళీ ప్రశ్నించాను ఇద్దరికీ వున్న పోలికల వల్ల పొరబడ్డానేమోనని లైన్లో కాస్త ముందదుకు జరుగుతూ.‘‘అవును మా అక్క పేరు ప్రణవీనే’’ అంది. ముఖంలో ఇందాకటి ఆశ్చర్యం, అనుమానం స్థానంలో కాస్త మొలక నవ్వు వచ్చింది.అమ్మయ్య నా గెస్‌ కొంతైనా కరెక్టయినందుకు నేను లోలోపలే సంతోషిస్తూ ‘‘మీ అమ్మ పేరు నీలవేణి కదూ!’’ అన్నాను మళ్ళీ. నా గొంతులో ఏదో ఆప్యాయత తొంగి చూడడం నాది నాకే తెలిసిపోతోంది.‘‘అవును. మా అమ్మ మీకు తెలుసా అంకుల్‌?’’ అంది ఏటీఎమ్‌ డోర్‌ లోపలికి వెళ్తూ. డోర్‌ మూసుకుంది. నేను బయటే నిలబడ్డాను. మా ఊరెంతో మారిపోయింది. ఒకప్పుడు మా ఊరు నుండి ఏ ఊరు వెళ్ళాలన్నా ఆర్టీసి బస్సే దిక్కు. ఇప్పుడు ఆటోలు, క్యాబ్‌లు, ఏటీఎమ్‌లు, దానిముందు బారెడు లైను. ఊరిప్పుడు చాలా మారిపోయింది.

ఎవరో ఆలోచనా పరుడన్నట్టు ్గరామాలు ధ్వంసం అయినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నట్లు మా ఊరు కూడా మెల్లమెల్లగా ధ్వంసమైపోతూ అటు టౌనూ కాని, ఇటు గ్రామమూ కాని విచిత్ర స్థితికి వచ్చి ఆగిపోయింది. ఏటీఎమ్‌ ముందు ఇంత లైనెందుకో, వీరికి ఇన్ని డబ్బులెక్కడినుండి వస్తున్నాయో నాకు అర్థం కాలేదు. ఏదో అదృశ్యశక్తి వీళ్ళని ముందదుకు నడిపిస్తుందేమోననిపించింది. లేదూ చావును తప్పించుకోవడానికి చావు అంచులదాకా పోయే పనేమైనా చేస్కుతన్నారా...!? ఆ అమ్మాయి పిన నెంబర్‌ టైప్‌ చేసి డబ్బుల కోసం ఎదురు చూస్తోంది.

నీలవేణి నా క్లాస్‌మేట్‌. అంటే ఇప్పుడు నా వయసే వుంటుంది. నాలుగు పదులు ఇప్పుడిప్పుడే దాటుతూ. నీలవేణి మా క్లాస్‌లోనే కాదు. మా ఊళ్ళోనే మెరుపుతీగ, అందాల నెలవంక. ఆమె ప్రేమలో పడని వాడు లేడు. కానీ ఆమె మాత్రం ఎవరి గురించీ పట్టించుకునేదిఇ కాదు. మేం కనీసం ఆమె దృష్టిపథంలోనైనా పడాలని తెగ తాపత్రయ పడేవాళ్ళం. కానీ ఆమె కనుచూపు మేరలోకి కూడా పోలేక ఆ సమీపంలోనే ఎక్కడో జారిపడిపోయేవాళ్ళం.