నాగమణికి పెద్దగా సామెతలు తెలీవు. తెలిసిందల్లా ఒకటే సామెత. బెలగాం వెళ్లాలనిపించినప్పుడల్లా ఆ సామెత గుర్తుకొచ్చేది. ‘అడివిలో అమ్మా అంటే ఎవరికి పుట్టేవురా కొడకా’ అని గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె చెరువయ్యేది. లోపలి పొరల్లో పేరుకు పోయిన ఏళ్లనాటి దుఃఖం కట్టలు తెంచుకునేది.

‘‘రమ్మనే వోళ్ళా...ఉండమనే వోళ్ళా? నాకు తెలక అడుగుతన్నాను నాగమణీ, బెలగాంలో నీకోపూట తిండిపెట్టే వోళ్ళయినా ఉన్నారేటే? ఎందుకే బెలగామో అనీసీ ఎగబడతావు?’’ అనేది ‘అమ్మ’.మనసు పీకినప్పుడల్లా నాగమణికి బెలగాం వెళ్లాలనిపించేది. అగ్రహారం వీధిలో ఆ కొసనుంచి ఈ కొసకి తిరిగి రావాలని తపించిపోయేది. వెళ్తానన్న ప్రతీసారీ ‘అమ్మ’ ఆమెను వద్దనేది. తన మాటకాదని వెళ్తే విజయనగరానికి తిరిగిరావొద్దనేది.‘అమ్మ’... అదో పేరు మాత్రమే. ఆవిడకి పిల్లల్లేరు. నాగమణి లాంటి చాలామంది మాత్రం ఆవిణ్ణి అలానే పిలిచేవారు! వాళ్ళంతా పొరపాట్లవల్ల పుట్టారట. ఎక్కడెక్కడనుంచో విజయనగరం చేరుకున్నారట. వాళ్ళని ‘అమ్మ’ చేరదీసి, తోవ చూపించిందట. అలా చూపించినందుకుగాను ఆవిడకి బాగానే కిట్టిందనేవారు.

విజయనగరం కోవెలవీధిలో మేడకూడా కట్టిందని వెనకటి రోజుల్లో చెప్పుకునే వారు. ‘అమ్మ’కి అవసాన దశ ముంచుకొచ్చేనాటికి నాగమణికి దశ తిరిగిందనీ, ఏదో మాయచేసి, పెద్దావిడ కట్టుకున్న మూటల్నీ, కట్టించిన మేడనీ నాగమణి సొంతం చేసుకుందని ప్రచారం ఉంది.సొంత మేనల్లుడు పైడిరాజుని పెంచుకుంది ‘అమ్మ’. చక్కనిచుక్క లాంటి నాగమణిమీద పైడిరాజు మనసుపడ్డాడు. (కాదు, నాగమణే పైడిరాజును పడేసి, పుస్తె కట్టించుకుందని గిట్టనివాళ్ళ మాట). ఫ్యాన్సీ సామాన్ల టోకు వ్యాపారం చేసే పైడిరాజు తరచు కలకత్తా వెళ్ళేవాడు. అతడలా వెళ్ళగానే రాజాంనుంచి ఓ బస్సు ప్రొప్రైటర్ నాగమణి ఇంటికి వచ్చేవాడని విజయనగరం నుంచి పార్వతీపురం దాకా కథలే కథలు!