నేను చాలా కాలంగా కథలు రాస్తున్నాను. కానీ కథా స్వరూపం గురించి, కథ ప్రయోజనాన్ని కార్పొరేట్‌ ప్రపంచం ఏ విధంగా వాడుకుంటుందన్న విషయం మీద ఈ మధ్యే ఒక ‘టాక్‌’లో పాల్గొనడం వల్ల మరింత నిర్దిష్టంగా తెలిసింది. నిరంతరం కొత్త విషయాలను తెలుసు కోవాలనే నా జిజ్ఞ్ఞాస కారణంగానే డబ్బులు కట్టి, ఆ ‘టాక్‌’లో పాల్గొన్నాను.

కథలు రెండు రకాలనీ, ఒకటి స్వీయ అనుభవాల సారాంశమనీ, రెండవది మనం సమాజాన్ని పరిశీలించడం ద్వారా కలిగిన ఆలోచనలను ఒక క్రమపద్ధతిలో చెప్పడమే కథ అని విశ్లేషించాడు. అంత వరకు ఓకే. అవి నాకు తెలిసినవే.తరువాత మానవజీవ పరిణామ క్రమంలో అత్యంత ముఖ్య ఘట్టం, కథలు చెప్పే సంఘటనే అనడం ఆశ్చర్యం కలిగించింది. అందుకు ఉదాహరణగా స్పీకర్‌ ‘First Man’ అనే డాక్యుమెంటరీచూపెడుతూ, ఆ ఫిల్మ్‌లో చివరి భాగంలో ఒక స్త్రీ నిలబడి మాట్లాడు తుంటే మిగిలిన వాళ్ళంతా ఉత్సుకతతో వింటున్న ఫోటో చూపించి అదే మొట్టమొదటి స్టోరీ టెల్లింగ్‌ సెషన్‌ అన్నాడు. అదే ఇప్పుడున్న హోమో సెపీయన్‌ (Homosapien), అంటే, ఇప్పుడున్న అసలైన తెలివైన మనుష్యజాతి ఆవిర్భావానికి నాంది అన్నాడు.

తర్వాత, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతీ ఒక్క ఎంటర్ఫ్యూనర్‌ కూడా స్టోరీ టెల్లర్‌ అయితే సమాజం అతన్ని ప్రత్యేక వ్యక్తిగా గుర్తిస్తుందని, వ్యక్తులతో బాంధవ్యాలను పెంపొందిస్తుందనీ, మనం అమ్మాలనుకున్న ఆలోచనలను కానీ, వస్తువులను కానీ అమ్మడం సులభమవుతుందని చెప్పుకొచ్చాడు.ఆ వెబ్‌ సెషన్‌ అయిపోయాక భోజనం చేసి పడుకున్నాను. ఎందుకో మధ్యరాత్రి చటుక్కున మెలుకువ వచ్చింది. వెబ్‌ క్లాసులో విన్న విషయాలను అన్వయించుకుంటూ ఈ మధ్య నా జీవితంలో, నా అనుభవంలోకి వచ్చిన ఒక సంఘటనను కథగా మలిస్తే ఎలాఉంటుందా? అని ఆలోచించి, రాయడం మొదలు పెట్టాను!ఫఫఫనేను రిటైరయ్యాక సాహిత్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాను. కానీ, ఏదో ఒక దుర్ముహూర్తాన, తెలుగులో రోజురోజుకీ సాహిత్యం చదివేవాళ్ళ సంఖ్య తగ్గిపోతూ టీవీలూ, సినిమాలు చూసేవాళ్ళ సంఖ్య పెరుగుతుందన్న, ఒక పాపిష్ఠి ఆలోచన రావడంతో రిటైర్‌మెంటుతో వచ్చిన డబ్బులతో ఒక సినిమా తీయడం ప్రారంభించాను.

ఆ సినిమా ఎన్నటికీ పూర్తి కాదూ, ఎన్ని డబ్బులు తెచ్చినా సరిపోవూ. ఒక బడ్జెటు అనుకుని, అంత మొత్తంలోనే పూర్తి చేస్తానని చెప్పిన డైరెక్టరు సగం వరకు రాగానే చేతులెత్తేశాడు, ముఖం చాటేశాడు. అప్పటికే సినిమా దర్శకత్వంలో కొన్ని మెళుకువలు నేర్చుకున్న నేను చచ్చీ చెడీ, మా ఆవిడ నగలు తాకట్టు పెట్టి, ఎలాగో అలా సినిమా పూర్తి చేశాను. కానీ, రిలీజుకు కూడా నోచుకోలేదు. ఇప్పటికీ నా కప్‌ బోర్డులో, ఆ సినిమా హార్డ్‌ డిస్కు, నన్ను వెక్కిరిస్తూ కనపడుతూ ఉంటుంది.