శంకరం కోరిన కోరికవిని ఇంట్లో అందరూ నివ్వెరపోయారు.చివరికి అతడి బామ్మ జానకమ్మ కూడా అతడి కోరిక విని ‘‘ఇదేం కోరికరా విచిత్రంగా?’’ అంది. ఎప్పుడూ తనకు అనుకూలంగా ఉండేబామ్మ కూడా ఈ విషయంలో తనకి సపోర్ట్‌ చెయ్యకపోయేసరికి తన ప్రతిపాదన నెగ్గే అవకాశం ఏ మాత్రం లేదని అర్థమైపోయింది శంకరానికి. అయినాసరే తన పట్టు వీడలేదు. ‘‘తను చెప్పినట్టు జరిగి తీరాల్సిందే’’ అన్నాడు. అతడు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో ఇంట్లో వాళ్ళంతా ఒకచోట సమావేశమై ‘‘ఏం చెయ్యాలా’’ అని చర్చించుకోసాగారు.

‘‘నాలుగేళ్ళు దాటితే నలభయ్యోపడిలో పడతాడు. ఇంక పెళ్ళి కాదేమోనన్న భయమైనా లేదే ఈ వెధవకి’’ విసుక్కున్నాడు శంకరం తండ్రి చయన్లు.‘‘అయినా పెళ్ళిచూపుల్లో వంట వచ్చా పనీ పాటా వచ్చా అని అమ్మాయిని అడుగుతారు. కానీ వీడేంటన్నయ్యా ఇలా విచిత్రంగా పెళ్ళి చూపుల్లో తనని పాట పాడమని అడగాలంటాడు?’’ అంది శంకరం మేనత్త శేషారత్నం.‘‘పోనీలెండి. వాడేదో ముచ్చటపడుతున్నాడు. అయినా వాడేం తన ముచ్చటని పెళ్ళి పందిట్లో తీర్చుకుంటాననడం లేదు కదా? పెళ్ళి చూపుల్లోనే కదా? అక్కడ అంతా కలిపి ఓ పాతికమంది కూడా ఉండంకదా.

ఒక్క పదినిమిషాలు మనవి కావనకుంటే సరిపోతుంది. ఆడపెళ్ళివారితో ముందుగానే మాట్లాడి వాడిముచ్చట తీరిస్తే పోలా?’’ భర్తకి నచ్చచెప్పాలని చూసింది శంకరం తల్లి పద్మావతి. ‘‘పది నిమిషాలు మనవి కాదనుకోవాలా? మనం కాదనుకుంటామే. కానీ ఆ తరువాత ఆడపెళ్ళివారు మనల్ని కాదనుకుంటారేమో? అదే నా భయం’’ అన్నాడు చయన్లు.‘‘ఇప్పటిదాకా ఆ వంకా ఈ వంకా చెప్పి వచ్చిన సంబంధాలు కాదన్నాడు. ఇప్పుడు వీడికిదో కొత్త కోరికపుట్టింది. ఇంక వీడికి సంబంధం కుదిరినట్టే. నువ్వు నాకు పట్టుచీర పెట్టినట్టే’’ అంది శేషారత్నం.