అందం, తెలివితేటలు కలబోసుకున్న ఓ యువతి అర్థరాత్రి కీకారణ్యంలో ఒంటరిగా నడచివెళుతోంది! ఆమెను చూసి దొంగలు ఆశ్చర్యపోయారు. తమ నాయకుడికి ఆమెను కానుకగా సమర్పించాలని నిర్ణయించుకున్నారు. కానీ కొద్దిసేపటికే తప్పుచేశామని భావించారు. ఆమె అందం చూసి మోహించిన ఒక మహాముని తపస్సు వదిలిపెట్టి ఆమెను పెళ్ళాడబోయాడు. కానీ మళ్ళీ కొద్దిసేపటికే వెనక్కు తగ్గాడు. వాళ్ళెందుకు అలా చేశారు? ఆమె ఎవరు? మంత్రగత్తా? అడవి దయ్యమా?

........................................

 

విదేహ దేశపు రాజకుమారుడు మందారవర్మ సామాన్యుడివేషంలో దేశాటనం చేస్తూ, ఒక గ్రామం చేరుకుని, అక్కడ రూపవతి అనే అందమైన యువతిని చూసి మోహించాడు.రూపవతి ఒక పేదరైతు కుమార్తె. గొప్పవాణ్ణి పెళ్ళి చేసుకుని వైభవంగా జీవించాలని ఆమె కోరిక. తనను ప్రేమించినది రాజకుమారుడు మందారవర్మ అని ఆమెకి తెలియదు. సామాన్యంగా కనిపించిన అతణ్ణి ఆమె తిరస్కరించింది. ఐనప్పటికీ మందారవర్మ చిన్నబుచ్చుకోకుండా, ‘‘తొలిచూపులోనే నేను నిన్ను ప్రేమించాను. నువ్వూ నన్నలాగే ప్రేమిస్తున్నావనుకోవడం నా అహంకారం. అందుకు నన్ను మన్నించి, నా ప్రేమకానుకగా నీకిస్తున్న ఈ ఉంగరం స్వీకరించు. ఏదో ఒకరోజున నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావన్న ఆశ నాకుంది. నీకోసం ఎదురు చూస్తాను’’ అని ఆమెకో ఉంగరం ఇచ్చి వెళ్లిపోయాడు.

రూపవతి ఆ ఉంగరం తీసుకుంది. ఇంటికివెళ్లి తల్లికి జరిగింది చెప్పింది. తల్లి ఆ ఉంగరాన్ని ఎగాదిగా చూసి, ‘‘ఇది మామూలు ఉంగరంలా లేదు. ఎక్కడో మహారాజుల ఇంట్లోంచి వచ్చి ఉండాలి’’ అంటూ వెళ్లి భర్తకి ఆ విషయం చెప్పింది.రైతు ఆ ఉంగరం తీసుకుని గ్రామాధికారి వద్దకు వెళ్లాడు. గ్రామాధికారి ఆ ఉంగరాన్ని పరీక్షించి, ‘‘ఇది రాజముద్రిక. నీ వద్దకి ఎలా వచ్చింది?’’ అని అడిగాడు. రైతు అతడికి జరిగిందంతా చెప్పాడు.గ్రామాధికారి సాలోచనగా, ‘‘ఐతే రూపవతిని కలుసుకున్నది యువరాజు మందారవర్మ అయుంటాడు. అతడు రూపవతిని ప్రేమించడం ఆమె అదృష్టం. నీ కూతురు రాజకుమారుడితో తిరస్కారంగా మాట్లాడి తప్పు చేసింది. అందుకు అతడు రూపవతిపై పగతీర్చుకోవచ్చు. రాజులు చపలచిత్తులు. మందారవర్మ నిజంగా రూపవతిని ప్రేమించినా, అది తాత్కాలికం. ఆమె ఈ ఉంగరం తీసుకొని, రాజధానికి వెడితే, అతడు ఆమెని చెరసాల పాలు చేయవచ్చు. జరిగింది మరచిపోయి ఊరుకోవడం మంచిది’’ అన్నాడు. రైతు ఉంగరంతోసహా ఇంటికివెళ్లి గ్రామాధికారి అన్న మాటలు చెప్పాడు.