‘‘రామూ, శిరీషకు ఒకసారి ఫోన్‌ చెయ్యి. నాతో మాట్లాడమను. ఎంతకాలమయ్యిందిరా అది నాతో మాట్లాడి? తల్లితో పది నిమిషాలు మాట్లాడటానికి కూడా తీరిక లేకుండా ఉందా దానికి? రాకపోకలు ఎలానూ లేవు. దాని మొగుడు దీన్ని రానివ్వడు కాబోలు. రాకపోతే పోయిందిలే... ఫోనులో మాట్లాడటానికి ఏం ఇబ్బందట? నాకు దానిమీద చాలా కోపంగా ఉందని చెప్పు. నేను ఇంకా బతికే ఉన్నానుగా. ‘అమ్మా ఎలా ఉన్నావు? అని అడగటానికి కూడా దానికి మనసు రావటం లేదంటే అది నా కూతురేనా అసలు!’’ అమ్మ కోపంగా అంది.

‘‘అలాగేలే అమ్మా! ఇంత రాత్రిపూట ఏం మాట్లాడతావు చెప్పు. రేప్పొద్దున్న చూద్దాంలే’’ అన్నాను అమ్మతో.అప్పుడు సమయం రాత్రి పన్నెండయ్యింది. అమ్మకు రాత్రి నిద్ర పట్టదు. ఎప్పుడేం అవసరం వచ్చి పిలుస్తుందో అని మెలకువగానే ఉంటాను. అమ్మ నిద్రలోకి జారుకున్నాకే నేనూ నిద్రపోయేది.శిరీష నాకు చెల్లెలు. అమ్మకు మేం ముగ్గురం సంతానం. పద్మక్క అందర్లోకీ పెద్దది. ఆ తర్వాత నేను. మా తాత పేరు రామం. ఆ పేరే పెట్టారు నాకు. నా తర్వాత శిరీష. అందర్లోకీ చిన్నది. అదంటే అమ్మకి చాలా ఇష్టం. పద్మక్కను సొంత మేనమామకే ఇచ్చి చేశారు.

దానికి ఇద్దరు పిల్లలు. కొడుకు, కూతురు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళకు తలా ఇద్దరేసి పిల్లలు.నాదీ, శిరీషదీ బయట సంబంధాలే. శిరీషకు ఇద్దరూ ఆడపిల్లలే. నాకేమో కొడుకు, కూతురు. నా పిల్లలిద్దరూ ఉద్యోగస్థులే. ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసేశాను. అమ్మాయికి ఒక కూతురు. అబ్బాయికి ఒక కొడుకు. అమ్మాయి మొగుడితోపాటు బెంగళూరులో ఉంటోంది. ఉద్యోగం చేస్తోంది. అబ్బాయి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు, వాళ్ళ కంపెనీ ప్రాజెక్టు పనిమీద.అందరూ బిజీబిజీనే. ఎవరి వ్యాపకాల్లో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేను, మా బావగార్లిద్దరూ ఉద్యోగాలకు పదవీ విరమణ చేశాక ఇంటి పట్టునే ఉంటున్నాం. పెద్దబావ కాకినాడలో, చిన్నబావ వైజాగ్‌లో, నేనేమో భాగ్యనగరంలో స్థిరపడ్డాం. మా అందరికీ వయసుతోపాటు వచ్చే ఏదో ఒక అనారోగ్యం.