హైవే రోడ్డులో గుర్తు తెలియని యువతి శవం కేసును డిటెక్టివ్‌ శరత్‌కు అప్పగించాడు ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌. అమ్మాయి ఎవరో, ఏమిటో వివరాలు తెలియవు. కిడ్నాప్‌, జాడతెలియకుండా పోయిన కేసులు కూడా నమోదు కాలేదు. శవాన్ని పరిశీలించాడు శరత్‌. పోస్టుమార్టం నివేదికలో టాక్సాలజీ వివరాలు గమ్మత్తుగా ఉన్నాయి . పొంతనలేకుండా ఉన్నాయి. అక్కడి నుండే తన పరిశోధన ప్రారంభించాడు శరత్‌.

ఇన్‌స్పెక్టర్‌ విజయ్ ఎదురుగా కూర్చున్నాడు డిటెక్టివ్ శరత్. ‘ఏమిటి విషయం?’ అని అడిగాడు.‘ఓ యువతి శవం రోడ్డు పక్కన పడి ఉంది. రెండు రోజులక్రితమే దొరికింది. మిస్సింగ్ రిపోర్టులులేవు. ఎవరో తెలియటంలేదు. నువ్వేమైనా తేలుస్తావేమోనని పిలిచాను’‘అమ్మాయిది హత్యా? ఆత్మహత్యా?’ అడిగాడు శరత్.‘నిస్సందేహంగా హత్యే. శరరీరంపై గాయాలున్నాయి. అత్యాచారం చేస్తున్న వాడితో అమ్మాయి పోరాడిన దాఖలాలు కనిపిస్తున్నాయి’.‘పోస్టుమార్టమ్‌ రిపోర్టు వచ్చిందా?’శరత్‌కి రిపోర్టు అందించాడు విజయ్‌.రిపోర్టు చదివిన శరత్ భృకుటి ముడిపడింది.‘నేనోసారి. పోస్ట్‌మార్టమ్‌ డాక్టర్ ఫణిని కలవాలి. అలాగే శవాన్ని చూడాలి’ అన్నాడు శరత్.

‘ఫణీ... పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టులో టాక్సికాలజీ (toxicology) రిపోర్టు గమ్మత్తుగా ఉంది.రక్తంలో ఆల్కహాల్ ఉందని రాశారుగానీ బెంజోడియా జెపైన్ (benzodio zepine) ఉందని కూడా పేర్కొన్నారు. కానీ ఆల్కహాల్, వాలియమ్ కలిపి తీసుకోవటం అంత సాధారణం కాదు కదా! ఆల్కహాల్ ఎలాగో మత్తు కలిగిస్తుంది. వాలియమ్ ప్రశాంతతనిచ్చి నిద్ర కలిగిస్తుంది. ఏదైనా డోస్ ఎక్కువై మరణం సంభవించిందా?’ అడిగాడు శరత్.‘నాకూ అదే అనుమానం వచ్చింది. ఆ పాయింట్‌ అండర్‌లైన్‌ చేశాను’ చెప్పాడు ఫణి.‘రోహిప్నాల్ (rohypnol) కోసం టెస్ట్ చేశావా?’శరత్ వైపు ఆశ్చర్యంగా చూశాడు ఫణి.‘డేట్ రేప్ డ్రగ్ (Date rape Drug). డేటింగ్‌కి వెళ్ళినప్పుడు అమ్మాయిల్ని మభ్యపెట్టి ఇచ్చే డ్రగ్‌. నా అనుమానం ప్రకారం అమ్మాయికి ఆల్కహాల్ ఇచ్చారు. అమ్మాయి స్వచ్ఛందంగా తాగి ఉంటుంది. ఆపై ఆమెకి తెలిసో, తెలియకో ‘రోహిప్నాల్’ ఇచ్చి ఉంటారు.‍‘రోహిప్నాల్‌ను రక్తంలో కనుక్కునేందుకు ప్రత్యేకపరీక్ష చేయాలి’ చెప్పాడు శరత్. తల ఊపాడు ఫణి. ‘తెలుసు. కానీ మన దగ్గర డేట్ రేప్ డ్రగ్ వాడే వారున్నారా’