వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఎన్నోసార్లు స్నేహితుణ్ణి ఆర్థికంగా ఆదుకున్నాడతను. స్నేహితుడి కూతుర్ని ఇంటి కోడలుగా కూడా తెచ్చుకోవాలనుకున్నాడు. తన కూతురు గొప్పింటి కోడలు అవుతున్నందుకు ఎగిరి గంతేశాడాస్నేహితుడు. స్నేహం రూపంలో తన కూతురికి అదృష్టం కలిసొచ్చిందని తెగ మురిసిపోయిడు. కానీ ఆ తర్వాత ఏ జరిగింది? ఆ స్నేహితుడు స్నేహధర్మాన్ని కాపాడగలిగాడా?

‘‘ఏంటమ్మా స్నేహా ఇది? కేశవమావయ్య వాళ్ళు ఈరోజు మన ఇంటికి వస్తున్నారని తెలిసికూడా నువ్వు ఆఫీసుకు వెళ్తానంటున్నావు...నాకేం నచ్చలేదమ్మా!’’ అన్నాడు శ్రీధర్‌.‍‍‘‘వాళ్ళొస్తే నేనుండి ఏం చెయ్యాలి నాన్నా? ఆ ఓవర్‌యాక్షన్‌, ఆర్టిఫిషియల్‌ ప్రేమలూ నేను భరించలేను, ఐ కాంట్‌ టాలరేట్‌ దట్‌ నాన్సెన్స్‌!’’ తండ్రివంక అసహనంగా చూస్తూ అంది స్నేహ.‘‘లేదమ్మా, కేశవమామయ్య చాలామంచివాడు. నేను చిన్నప్పటినుండీ చూస్తున్నానుకదా. మాయామర్మంలేని మమకారంవాడిది. అది ఎగ్జిబిషన్‌ కాదమ్మా! నామీద అంతులేని ఆపేక్ష...’’ అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు శ్రీధర్‌.

‘‘ఏమో నాన్నా, ప్రేమ ఉంటే ఉందేమోగానీ నాకుమాత్రం అదంతా రియల్‌గా అనిపించదు. తెచ్చిపెట్టుకున్నట్టుంటుంది. అడుగడుగునా వాళ్ళ మంచితనం, ఐశ్వర్యాలను మనలాంటివాళ్ళంతా గుర్తించాలని తాపత్రయపడిపోతూ ఉంటారు. ఆ స్వంతడబ్బా నాకు అస్సలు నచ్చదు. ఆ యశ్వంత్‌కూడా వాళ్ళలాగే తానా అంటే తందానా అన్నట్లుగా తయారయ్యాడు. సారీనాన్నా, అన్నయ్యలాగా, నీలాగా వాళ్ళను భరించే ఓపిక నాకులేదు. సాయంత్రం ఆఫీసు అయ్యాక ఇంటికి వస్తాను కదా, రాత్రికి ఎలాగూతప్పదు, ఇప్పటినుండే నాకెందుకు ఆ తలనొప్పి, వస్తాను టైమయింది!’’ అంటూ తండ్రి జవాబుకోసం ఎదురుచూడకుండా చెప్పులువేసుకుని వీధిలోకి నడిచింది స్నేహ.కూతురు వెళ్ళినవంకే అభావంగా చూస్తూ ఉండిపోయాడు శ్రీధర్‌.కేశవరావూ, శ్రీధర్‌ బాల్యస్నేహితులు. ఎలిమెంటరీస్కూలు నుండి డిగ్రీ వరకూ కలిసి చదువుకున్నారు.

ఒకరంటేఒకరికి పంచప్రాణాలు. ఆర్థికంగాచూస్తే శ్రీధర్‌కంటే కేశవరావుకుటుంబం ఒకమెట్టు పైనే ఉంటుంది. అయినా అది వారి స్నేహానికి ఏనాడూ ప్రతిబంధకం కాలేదు.ఎన్నో కష్టసమయాల్లో శ్రీధర్‌ కుటుంబాన్ని ఆదుకున్నాడు కేశవరావు. అయినా అదేదో పెద్ద ఘనకార్యంలా అతను ఏనాడూ భావించలేదు. మిత్రునిగా అది తన కర్తవ్యం అనుకున్నాడు.చదువులు పూర్తయ్యాక ఉద్యోగరీత్యా శ్రీధర్‌ విశాఖపట్నం వచ్చేశాడు. తండ్రి వ్యాపారం చూస్తూ కేశవరావు విజయవాడలోనే ఉండిపోయాడు. అయితే అది వారి స్నేహానికి ఏమాత్రం ఆటంకంకాలేదు. తరచు రెండుకుటుంబాలూ కలుసుకుంటూనే ఉన్నాయి. శ్రీధర్‌ కొడుకు విశాల్‌, కేశవరావు కొడుకు యశ్వంత్‌ మంచి స్నేహితులు కూడా! ఎటొచ్చీ స్నేహకే వారి వైఖరి అంతగా నచ్చదు.