సినిమా సమాచారం సూరిబాబుకి కొట్టినపిండి. పాటలైతే మరీనూ. వాటి విషయంలో ఎవరైనా వాదనకి దిగితే, ‘‘ఏటి? పందెమా?’’ అంటూ కళ్ళెగరేసేవాడు. సూరిబాబు జోరు చూసి ఎదుటివాళ్ళు కొంచెం తగ్గేవారు. ఆ రోజుల్లో క్విజ్ లూ, అంత్యాక్షరీ పోటీలూ లాంటివి లేవుగానీ, ఉంటే సూరిబాబుకి ఎంత పేరొచ్చేదో!

సూరిబాబుది బెలగాంసెంటర్‌కి ఎగువున నాయుడువీధి. చిన్నప్పుడే తండ్రిపోయాడు. తల్లి దొడ్లంకివాళ్ళ బియ్యంమిల్లులో పనిచేసేది. ఇల్లు గడవక పదోక్లాసు సగంలో మానేసి టైలర్సుబ్బారావు దగ్గర పనిలోచేరాడు సూరిబాబు. బెలగాంసెంటర్‌కి దిగువున అగ్రహారం వీధిలో పొక్కునూరివారి అరుగుమీద ఉండేది సుబ్బారావు టైలర్ దుకాణం. అరుగువెనకాల రెండు డాబాగదులుండేవి. వాటిలో కొత్తగా పెళ్ళైన మన్మథరావు అద్దెకి దిగాడు. మన్మథరావు భార్య ఎంత ముక్తసరిగా మాట్లాడేదో వాళ్ళింట్లో మర్ఫీ రేడియో అంతపెద్దగా వాగేది. ఉదయాన్నే ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్‌తో గొంతెత్తి, రాత్రి ‘ఈనాటి కార్యక్రమాలు ఇంతటి తో సమాప్తం’ అని సెలవు తీసుకునే వరకు మన్మథరావు రేడియో పదిళ్ళదాకా వినిపించేది.టైలర్సుబ్బారావు వాచీ చూసుకునేవాడుకాదు. మర్ఫీరేడియోనే ఫాలో అయిపోయేవాడు.

ఉదయం దుకాణంతెరుస్తూనే ఏదో కార్యక్రమప్రకటనవింటూ ‘తొమ్మిదైంది’ అనుకునేవాడు. అలాగే ‘‘మరి కాసేపట్లో...’’ అని రేడియో లో అనౌన్స్‌మెంట్ వినగానే ‘పావు తక్కువ పన్నెండు’ అంటూ అగ్రహారం వీధిచివర రావిచెట్టుకింద ఇంటికి భోజనానికి వెళ్ళిపోయేవాడు. భోజనంచేసి, బాగా నిద్రపోయి, లేచి టీచుక్కతాగి నాలుగింటికి దుకాణానికి వచ్చేవాడు. బాగా చీకటిపడ్డాక ‘‘కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు..ఢిల్లీనుంచి ప్రసారం’’ అని రేడియోలో వినగానే ‘తొమ్మిదైపోతన్నాది కొట్టు కట్టీయాల’ అనుకుంటూ లేచేవాడు. అర్దరాత్రిదాటినా సుబ్బారావు టైలర్దుకాణంలో కుట్టుమిషన్ చప్పుడు వినిపించిందీ అంటే సంక్రాంతి దగ్గరపడుతోందన్నమాటే.