పంద్రాగస్టున దేశమంతటికీ విముక్తి లభించింది. కానీ తెలంగాణకు 13 నెలలు ఆలస్యమైంది. వెనక్కి తిరిగిచూస్తే, నలభయ్యోదశకంలో తెలంగాణ ఒక నిప్పుల కొలిమి, రాక్షసపీడనకు నిలయం. గ్రామాల ధ్వంసం, సజీవదహనాలు, వివస్ర్తలనుచేసి స్ర్తీలపై సామూహిక అత్యాచారాలు..! అదో ఘోరకలి. నాటి ప్రజాసైన్యం త్యాగాల యాది, ఆ విముక్తి ఫలాల తీరు తెన్నులు ఆ పండుటాకును అశ్రునయనగా మార్చాయి.

1942 నుండి 1951 తర్వాతదాకా...తెలంగాణ ఒక అగ్నిగుండం. తెలంగాణ ఒక నిప్పులకొలిమి. తెలంగాణ ఒక కన్నీటి సముద్రం. తెలంగాణ రక్తసిక్తమైన పిడికిలిలో తుపాకీ ధరించి భూమిలోనుంచి ఉద్భవించిన విప్లవహస్తం. తెలంగాణ ఆకాశమెత్తు విక్రమించి మూడువేలగ్రామాలనూ, పదిలక్షల ఎకరాలభూమినీ విముక్తపరచి ప్రజలపరం చేసిన యోధ. ప్రపంచ ప్రసిద్ధిచెందిన తెలంగాణ సాయుధరైతాంగపోరాటం చదువురాని నిరక్షరాస్య ప్రజాసైన్యానిదే. ఏండ్లతరబడి గ్రామసంఘాలుగా, దళాలుగా గెరిల్లా తిరుగుబాటుదారులుగా, వ్యూహకర్తలుగా, ప్రజాకంటకులైన భూస్వామ్య బూర్జువాలనూ, దొరలనూ, జాగీర్దార్లనూ, దేశ్‌ముఖ్‌లనూ, ముఖ్తేదార్లనూ, జమీన్‌దార్లనూ గడగడలాడించి తరిమి, తన్ని, అవసరమైతే చంపి దశాబ్దాల పీడననుంచి తెలంగాణను విముక్తం చేసిన మహోగ్ర ప్రజావెల్లువ.పిడికెడు గుండెలో మనిషికి జీవితంలో మరుపురాని జ్ఞాపకాలన్నీ సజీవమై ఎప్పటికప్పుడు గుప్పుమని మండే పెట్రోల్‌బావులే. ప్రతి యాదీ ఒక నిప్పుల చెరువు.‘జాగ్రత్తగా విను. మనిషిని చంపడం, నిర్మూలించడం ఒక్కటికాదు.

ఏ కారణంచేతనైనా మనిషి ప్రాణాలు తీయడం, చంపడం హత్య. కానీ ప్రజాకంటకుడైన కలుపుమొక్కలాంటి వ్యక్తినీ, కుందేళ్లనూ,జింకలను నిర్ధాక్షిణ్యంగా చంపితినే పులివంటి క్రూరమృగాన్నీ చంపడం నిర్మూలన. దుష్టశక్తుల నిర్మూలన యుగధర్మమని మన భారతీయచింతన ఆదినుంచీ ప్రవచిస్తూనే ఉంది. నరకాసుర సంహారం, రావణవధవంటివన్నీ మానవులు రాక్షసపీడననుంచి విముక్తిపొందిన ఘటనలే. అందుకే అవి ప్రజలకు పండుగలైనాయి. కలుపుమొక్కలను నిర్దాక్షిణ్యంగా పీకెయ్యనిదే పంటమొక్కలు బతకలేవు. ఇప్పుడు మనం ఈ మన ప్రజాయుద్ధమైన తెలంగాణసాయుధ రైతాంగ పోరాటాన్ని మనప్రాణాలకు తెగించి కొనసాగిస్తున్నది కూడా ధర్మ సంరక్షణకే..’ అతని గొంతు ఇంకా తాజాగా, నిన్నరాత్రి విన్నట్టే ఖంగుమని వినబడ్తోంది.ఎనభైరెండేళ్ళ ఆమె కిటికీదగ్గర కూర్చుని, కిటికీలోనుంచి, దూరంగా గర్జిస్తున్న సముద్రం దిక్కు చూస్తోంది. ఒకటే హోరు. ఎడతెగని నిరంతర ఘర్షణ. అలసిపోని అలల చేతులతో నిర్విరామ యుద్ధం.