మిత్రులంతా ఓచోట చేరారు. ఎక్కడో దూరంగా ఉన్న మరో ప్రియమిత్రుడు ఆ ఆనంద క్షణాల్ని మిస్సయ్యాడు. అతను కూడా ఉంటే ఎంతబావుణ్ణో అనుకున్నారు. అంతలోనే టిక్‌...టిక్‌..టిక్‌ మని శబ్దం. తలుపులు తెరచిచూస్తే ఎదురుగా ఆ ప్రియమిత్రుడే. ఎగిరి గంతేశారంతా. అంతలోనే ఫోన్‌ కాల్‌. హడావుడిగా టీవీ ఆన్‌చేసి చూసి దిగ్ర్భాంతి చెందారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ మిత్రులు ఎందుకు అక్కడ సమావేశమయ్యారు?

టిక్‌...టిక్‌...టిక్‌...తలుపులమీద ఎవరో చాలా సున్నితంగా కొడుతున్నారు.హాల్లో కూర్చున్న మిత్రులు ఐదుగురూ ఒక్కసారే ఉలికిపడ్డారు. ఒకర్నొకరు మొహామొహాలు చూసుకున్నారు.‘‘కొంపదీసి మధు భార్యాపిల్లలు తిరిగి వచ్చెయ్యలేదు కదా!’’ ఉన్నట్టుండి అన్నాడు రాఘవ. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారే అదిరిపడ్డారు. మధుకేసి అయోమయంగా చూశారు.‘‘ఒరేయ్‌! మా ఆవిడ, పిల్లల్ని బస్సు ఎక్కించాకే కదా మిమల్ని రమ్మని ఫోన్‌ చేశాను. కచ్చితంగా రెండురోజుల వరకు మావాళ్ళు రారు. అయినా ఊరెళ్ళినవాళ్ళు వెంటనే ఎలా తిరిగొస్తార్రా?’’ చిరాగ్గా అన్నాడు మధు. మిగతా మిత్రులు నలుగురూ, అయోమయంగా మధు కేసి చూశారు.

‘‘మరి ఎవరై ఉంటారు?’’ అందోళనగా అడిగాడు రాజు.‘‘టిక్‌...టిక్‌...టిక్‌’’ మళ్ళీ తలుపు తడుతున్న శబ్దం.‘‘ఒరేయ్‌ రాజూ! నువ్వెళ్ళి తలుపులు తియ్యరా’’ తన పక్కనే పేక కలుపుతున్న మిత్రుడితో చెప్పాడు మధు.‘‘కొంపదీసి పోలీసులైతే?’’ లేచి నిలబడి భయంగా అన్నాడు రాజు.ఆ మాటకు మిగతా ముగ్గురు భయంతో బిగుసుకుపోయారు. చటుక్కున పేకముక్కలన్నీ తీసి కార్పెట్‌కింద దాచేశారు.

టేబుల్‌ని మామూలుగా సర్దేసి ఏమీ ఎరగనట్టు బుంగమూతి పెట్టుక్కూర్చున్నారు.‘‘పేకలు దాచేశారు సరే, మరి ఆ విదేశీ మద్యం సంగతి! అది మన దగ్గర ఉండకూడదు తెలుసా? ఆ మందు సీసాలు పోలీసులు చూస్తే అందరం జైల్లో ఊచలు లెక్కపెట్టాలి’’ భయంగా అన్నాడు మధు.మధు అలా అనేసరికి వెంకట్‌ చటుక్కున లేచి వంటగదిలో ఉన్న బాటిల్స్‌ తీసి ఎవరికీ కనిపించకుండా అటకెక్కి పాత బిందెల్లో దాచేశాడు.గుండెలనిండుగా ధైర్యం కూడగట్టుకుని ఓరగా తలుపు తెరిచి చూశాడు రాజు.ఎదురుగా నలిగిన బట్టలు కట్టుకున్న పనిమనిషి రంగమ్మ కనిపించింది. ఆమెని చూస్తూనే హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు రాజు.