మెరుగైన జీవితం జీవించాలని అందరూ కోరుకుంటారు. కానీ ఆ రైతు కుంటుంబంలో అమ్మాయి మాత్రం పట్టుబట్టి పట్నం సంబంధం చేసుకుంది. బాగా స్థిరపడింది. దాని ప్రభావం కొడుకు అనుభవించాడు.. అది ఆ కుటుంబంలో అసంతృప్తికి దారితీసింది. వలస జీవితం అందంగా ఉంటుంది, ధనికవంతంగా ఉంటుంది కానీ ఆ పర్యవసానాలెలా ఉంటాయో, ఎటువైపు దారితీస్తాయో ఒక చిన్న సంఘటనతో చెప్పే ఈ కథ చదవండి.

హాల్లో వున్న ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ రింగవుతోంది. వరండాలో కూర్చుని పేపరు చదువుతున్న కృష్ణారావు, ‘లోపల భార్య ఫోను ఎత్తుతుందేమో!’ అనుకున్నాడు. కానీ ఆ సూచనలు కనిపించలేదు. ఇక తనే పేపరు పక్కన పడేసి వెళ్ళాడు. అతను ఫోన్‌ ఎత్తేలోపల శబ్దం ఆగిపోయింది. అతను తిరిగి వరండాలోకి వచ్చి పడక కుర్చీలో కూర్చుని పేపరు చదవడం మొదలెట్టాడు.కాసేపటికి ఛాయాదేవి వచ్చింది. తలంటు స్నానం చేసి వచ్చినట్టుంది, తలకి టవలు చుట్టుకుంది.‘‘కాఫీ తాగుతావంటయ్యా?’’ అని అడిగింది.‘‘ఆఁ పెట్టు’’ అన్నాడు.ఆమె లోపలకు వెళ్ళబోతుంటే అన్నాడు.‘‘ఎవరో ఫోన్‌చేశారు. నువ్వు ఎత్తుతావనుకున్నాను. నేను వెళ్ళేసరికి ఆగిపోయింది’’.

‘‘నేను స్నానం చేస్తున్నాలే!’’‘‘ఎవరు చేసి ఉంటారు?’’‘‘ఎవరని తెలుస్తుంది? ఎవరిదో పేరంటం అయి ఉంటుంది. ఇదివరకు ఇంటికొచ్చి పిలిచేవారు. ఇప్పుడు ఫోన్‌చేసి ‘మా అమ్మాయికి ఓణీలు ఇస్తున్నామనో,, ‘మా మనవరాలికి సీమంతం అనో’ ‘మా బుజ్జిగాడి పుట్టినరోజు అనో ఫోన్‌ చేస్తున్నారు. కాలం మారిపోయింది’’.‘‘నిజమేలే! మరిక ఫోన్లెందుకు పెట్టించుకున్నది?’’ అని నవ్వాడు కృష్ణారావు.‘‘నయమేలే! పెళ్ళిళ్ళకు మాత్రం ఇంటికొచ్చి కార్డులు యిచ్చి రమ్మంటున్నారు. ముందు ముందు అదీ ఉండదేమో?’’

‘‘ఆ రోజులూ వస్తాయి. హైదరాబాద్‌ వెళ్ళినప్పుడు చూశాగా! అమ్మాయికి ఎవరో ఫోన్‌చేసి మా అబ్బాయి పెళ్ళి కార్డు మెయిల్‌ చేశాం అంటారు. అది వెళ్ళి కంప్యూటర్‌లో చూస్తుంది పెళ్ళి ఎక్కడ? ఏమిటి? అని ఇక పిలుపులేమీ ఉండవు’’ అన్నాడు కృష్ణారావు.కాసేపటి తర్వాత ఛాయాదేవి ప్లాస్టిక్‌ బుట్టలో క్యారేజీ, నీళ్ళ సీసా పెట్టుకుని ‘‘నేను పొలం వెళ్తున్నా!’’ అని బయల్దేరింది.పిల్లలకు దసరా సెలవులని పుట్టింటికి వెళ్ళింది కోడలు. ఇక ఆమెకు పొలం వెళ్ళక తప్పలేదు. మోకాళ్ళ నొప్పులని కృష్ణారావు అంత దూరం వెళ్ళడం లేదు.