అతడి గారాలపట్టి ఆ చిట్టితల్లి. ఒక్కక్షణం కూతుర్ని విడిచి ఉండేవాడు కాదు. తన చిట్టితల్లిని దేవుడిచ్చిన వరంగా భావించాడు. భార్య మందలించినా ముద్దు చేయడం మానలేదతను. ఫస్టుక్లాసులో పాసైన కూతురు మంకుపట్టు పట్టింది. చేసేదిలేక పట్నం కాలేజీలో చేర్చాడు. కూతురుకోసం కాలేజీకి వెళ్ళిన ఆ తండ్రికి అక్కడ ఎలాంటి దృశ్యం కనిపించింది? అప్పుడతను ఎలా రియాక్టయ్యాడు?

వీరినాయుడు బోనులో నిలబడి ఉన్నాడు. యాభైకి పైబడిన వయసు. తెల్లచొక్కా, తెల్లపంచె, ముఖంలో మూర్తీభవించిన మంచితనం. నుదిటిమీద పెట్టిన నిలువుబొట్టు అతని ఆధ్యాత్మితకు ప్రతీకలా నిలిచింది. అతని కళ్ళు నిశ్చలంగా ఉన్నాయి. ఆ కళ్ళలో ఏ భావమూ ద్యోతకం కావడంలేదు. నిలబడి తపస్సు చేస్తున్న మహర్షిలా ఉన్నాడతను. కోర్టు నిశ్శబ్దంగా ఉంది.‘‘ఒక వ్యక్తిని నువ్వు దారుణంగా నరికి చంపావు. అందుకు నీకు కఠినశిక్ష విధించాల్సి ఉంటుంది. నీ తరపున వాదించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?’’ జడ్జి గంభీరమైన గొంతు కోర్టులో ప్రతిధ్వనించింది.తల అడ్డంగా ఊపాడు వీరినాయుడు.జడ్జి ఒక నిముషం మౌనంగా ఉండిపోయాడు.‘‘పోనీ నువ్వు చెప్పాల్సింది ఏదైనా ఉందా?’’‘‘ఉంది’’ ధృడంగా అన్నాడు వీరినాయుడు.

‘సాయంత్రం ఆరవుతోంది.నిశ్శబ్దమైన ప్రకృతిలో నిమ్మకునీరెత్తినట్టు తాపీగా నడుస్తున్న బళ్ళ ఎద్దులమెళ్ళో గంటలగణగణలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. ఏతాముల కిర్రుధ్వని మాధుర్యం గాలితో లయబద్ధంగా శృతికలిపి చెవులకి ఇంపుగా సోకుతోంది. సృశించిపోయిన చిరుగాలి స్పర్శకి పరవశించి తన్మయత్వంతో ఊగిసలాడుతున్న పచ్చటిపైర్లు సోయగాల్ని వెదజల్లుతున్నాయి. గాలికి అలవోకగా ఎగిరే పైటలని ఎడంచేత్తో ఒంటికి అదుముకుంటూ కుడిచేత్తో నెత్తిమీద కుండ అంచు పట్టుకుని శృంగారం ఒలకబోస్తూ లయబద్ధంగా పాడుతున్న పల్లెపడుచులు ఏటిగట్లమీద వరుసలుతీరి నడుస్తూ ఇంటికిచేరే ఆత్రంలో ఉన్నారు.

చెరువునీళ్ళలో ఈతలుకొడుతూ అల్లరిచేస్తూ ఆనందించే కుర్రాళ్ళ కేకలు దూరాన ఉన్న సముద్రఘోషలా లీలగా వినబడుతున్నాయి.శ్రీరంగనాథుని కోవెలలో గంటలశబ్దం గాలిలో మంద్రంగా కలిసిపోయి భగవంతుని దగ్గరనుండి వస్తున్న పాటలా వినబడుతోంది.‘ఎంత అందంగా ఉంది ఊరు!’ అనుకున్నాడు వీరినాయుడు, అతని జీవితంలో అదృష్టాలు రెండే రెండు. ఒకటి ఊరు, రెండోది వరాలు.‘‘ఏడకి పోయిందబ్బా ఇది?’’ అనుకున్నాడు వీరినాయుడు. అలా అనుకోవడం గడచినగంటలో ఏ వందోసారో. వీరినాయుడికి మనసు మనసులో లేదు.