ఎంతో కాయకష్టం చేసి, ఆస్తులమ్మి చదివించి అతడిని ప్రయోజకుణ్ణి చేశాడు తండ్రి. అతను కూడా అదేతోవలో ప్రయాణించాడు. కష్టపడి తన కొడుకును చదివించి విదేశాల్లో స్థిరపడేట్టు చేశాడు. చాలామంది తండ్రులు ఇలాగే చేస్తారు. కానీ ఆకస్మికంగా ఇండియాకు తిరిగి వచ్చేస్తానన్న కొడుకు కోసం మళ్ళీ మరో త్యాగానికి సిద్ధపడ్డాడు ఆ తండ్రి. ఇంతకూ అతడు చేయాలనుకున్న త్యాగం ఏమిటి? ఆ తండ్రి ఆలోచన సరైనదేనా?

ఆ ఊళ్లో మాకు మిగిలినఆస్తి ఒక మామిడితోట, ఇల్లు మాత్రమే. వాటిని కూడా అమ్మేయాలనే ఆలోచన వచ్చినా, సొంతఊరుతో ఉన్న అనుబంధం వదులుకోదల్చుకోలేదు. అందుకే ప్రతిఏడాది చివర్లో మా ఊరికొచ్చి మామిడితోటమీద వచ్చే ఆ నాలుగు కౌలుడబ్బులు వసూలుచేసుకొని, చిన్నచిన్న రిపేర్లతో ఇంటిని నివాసయోగ్యంగా మలుచుకుని టౌనులోని స్వంతగూటికి చేరుకోవటం చాలా సంవత్సరాలనుంచి ఆనవాయితీగా ఆచరిస్తూనే ఉన్నాను.ఈసారి ట్రిప్‌లో అనుకున్నంత వేగంగా పనులు జరగలేదు. మామిడితోటను ఎప్పుడూ కౌలుకు తీసుకునే అప్పయ్య మరణించాడు. ప్రతిసంవత్సరం ఇంటికి మరమ్మత్తులు చేసేవాడు అందుబాటులోలేడు. మరికొన్నాళ్ళు ఆ ఊళ్ళో ఒక్కణ్ణే బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వస్తుందేమోనని దిగులుచెందుతున్న తరుణంలో చిన్ననాటి స్నేహితుడు, ఆ ఊరి వాడే శేఖరం నా ముందు ప్రత్యక్షమై ఆశ్చర్యపరిచాడు. తోడు దొరికినందుకు క్షణకాలం మనసు తెరిపిన బడింది.

శేఖరం మొదటినుంచీ నాకు దగ్గరైన మిత్రుడు. ఈ మధ్య టౌనులో కలవటంలేదు కానీ, చాలా సంవత్సరాలు అరమరికలు లేకుండా ఒకరి కష్టసుఖాలు మరొకరం పంచుకున్న వాళ్ళమే! దాదాపు పదిసంవత్సరాల క్రిందట కొడుకు రాజాను ఫారిన్‌ పంపేందుకు నానాకష్టాలు పడ్డాడు. అంతెందుకు నా దగ్గరకూడా సర్దుబాటుగా కొంత డబ్బు తీసుకుని కొడుకు పైచదువుల కోసం యాతనపడ్డవాడే!శేఖరం రాకతో నాలో ఒక్కసారిగా ఉత్సాహం పెల్లుబికింది. చిక్కటి కాఫీ చేతికందిస్తూ ‘‘ఏరా! ఎన్నాళ్ళ ప్రోగ్రాం వేసుకున్నావ్‌?’’ అని అడిగాను.కాఫీ చప్పరిస్తూ, ‘నేనిక్కడ ఎన్నాళ్ళు ఉండటమనేది నీ మీదే ఆధారపడి ఉంది!’ అన్నాడు.నాకు అర్థం కాలేదు. ‘‘నేను ఈసారి ఈ కౌలు గొడవలో పదిరోజులు ఉండాల్సి వస్తుందేమో’’ అన్నాను. నేనున్నాళ్ళు వాడు తోడుగా ఇక్కడఉంటే పండుగే! హాయిగా మా ఇంటి కాపలాగా ఉంటున్న పనిమనిషి లక్ష్మి వంటచేసి పెడ్తుంటే ఊరంతా చిన్నప్పటి మాదిరి కలియదిరగొచ్చు! సాయం సమయాల్లో పొలాల గట్టుమీద నడుస్తూ పాతజ్ఞాపకాలు నెమరేసుకోవచ్చు.