ఉద్యోగంలో ఉన్నంతకాలం అతనిది బిజీ సీటు. ఈ మధ్యే రిటైరయ్యాడు. దాంతో ఒక్కసారిగా ఒడ్డునపడిన చేపలా విలవిలలాడిపోతున్నాడు. దానికితోడు ఇంట్లో భార్య కూడా కొత్తగా గయ్యాళి అవతారం ఎత్తింది. ఓ ముచ్చట, మాటామంతీ లేకుండాపోయింది. ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లో ఉన్న అలాంటి సమయంలో పద్దూ కనిపించిందతనికి! ఒక్కసారిగా అతనిమొహం విప్పారింది. ఇంతకీ పద్దూ ఎవరు? ఏమాకథ?

భళ్ళున గ్లాసు బద్దలైనట్లొచ్చిన శబ్దానికి ఉలికిపడి కళ్ళు తెరచాడు ప్రకాశరావు.కాఫీకప్పు విసురుగా గ్లాస్‌ టీ పాయ్‌ మీదపెట్టి అంతకంటే విసురుగా వెళ్ళిపోతోంది శాంత. కోపాన్ని తన నడకలో ప్రదర్శించాలనుకున్నా అరిగిపోయిన మోకాలిఎముక అందుకు సహకరించడంలేదు.నిస్సహాయంగా కప్పు అందుకుని కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు ప్రకాశరావు.ఈ మధ్య శాంతకి కోపం ఎక్కువైపోయింది. ఎందుకలా విసుక్కుంటోంది? తనేం చేశాడని!‘‘పొద్దున్నే ఏం కొంపంటుకుపోయాయని లేచి కూర్చోవడం! ఇప్పుడేవన్నా ఉద్యోగమా, సద్యోగమా! చేసినన్నాళ్ళూ నంజుకుతిన్నారు! ఇప్పుడన్నా కాసేపు పడుకునిచద్దావంటే లేచికూర్చుని కాఫీకోసం గుంటదగ్గర నక్కలా తననే చూడటం! కాస్త కాఫీ పెట్టుకుని తాగలేరూ! మాయదారి సంత!’’ శాంత అష్టోత్తరం అతనికి వినిపిస్తూనే ఉంది.తనీమధ్యనే రిటైరయ్యాడు. చేసినన్నాళ్ళూ చాలా బిజీ సీటు.

రాష్ట్రమంతటా తమశాఖలోవారి ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు అన్నీ తనే డీల్‌ చేసేవాడు. దాంతో వచ్చేపోయేవారి రద్దీ చెప్పనలవి కాదు. ‘ఒక్కరూపాయి తినని నిజాయితీ ఆఫీసర్‌’ అని తనకి పేరుంది. అలా ఖచ్చితంగా ఉండటంవల్ల కూడా చాలా ఇబ్బందులే పడ్డాడు. డబ్బుతో పనులు చేయించుకోవడానికి అలవాటుపడ్డ అడ్డదారి మనుషులు రాజకీయాలు నడిపేవారు. ఏదిఏమైనా తనని తప్పించడానికి వీలులేక తలలు పట్టుకునేవారు. నిజానికి ఇంటిసంగతులన్నీ శాంతే చూసుకునేది. శాంత నిజంగా శాంతే. ఎంతో ప్రశాంతంగా తనకి అన్నివిధాల సహకరించింది. పిల్లలిద్దరి చదువులూ సంస్కారాలూ, వాళ్ళ పెళ్ళిళ్ళూ అంతా ఆమె చేతులమీదనే జరిగి పోయాయి. ఆర్థిక లావాదేవీలు చూడటం మాత్రమే తన బాధ్యత!తను నిద్రపోతుంటే పిల్లలు టీవీ పెట్టినా గట్టిగా నవ్వినా ‘మీ నాన్నగారు పడుకున్నారు. ఆఫీసు చాకిరీతో అలసి పోయుంటారు. అల్లరి చెయ్యొద్దు’ అని మందలించడం తనకి బాగా తెలుసు.