ఇంటర్‌కాం ఒక్కసారి మోగగానే అటెండయ్యాడు ప్రత్యగాత్మ,‘‘అమ్మగారేనా?’’ అడిగాడు. తల్లీ, తమ్ముడూ వస్తారని ఎదురు చూస్తున్నాడతను. వాళ్ళు కార్లో బయలుదేరి, మూడుగంటలు దాటింది. వర్షంమూలంగా ఆలస్యం అవుతుండవచ్చని అనుకున్నాడు.‘‘కాదు సాబ్‌.. పట్వారీ సాబ్‌, విష్ణువర్థన్‌ సాబ్‌ వచ్చారు’’.

ఒకక్షణం డిస్టర్బ్‌ అయ్యాడు ప్రత్యగాత్మ. వచ్చిన వాళ్ళు తను ఆత్రంగా ఎదురుచూస్తున్న తల్లి కానందుకూ, ఆ అవాంఛిత వ్యక్తులు అభ్యాగతులైనందుకూ.అంతలోనే సర్దుకుని ‘‘పంపించు’’ అన్నాడు.రెండునిముషాలకి వాళ్ళని తీసుకువచ్చాడు చౌకీదార్‌. ప్రత్యగాత్మ తలుపుతీసి, వాళ్ళని లోపలికి పిలిచాక, తలుపు దగ్గరక లాగి, వెళ్ళిపోయాడు.‘‘ఎందుకు వచ్చారు?’’ సాధ్యమైనంత మృదువుగా అందామనుకున్నా, కరుకుదనమే ధ్వనించింది ప్రత్యగాత్మ స్వరంలో.‘‘చెబుతాం సార్‌, కూర్చోనివ్వండి’’ చిన్నగా నవ్వాడు పట్వారీ.‘‘తొందరగా చెప్పండి. అతిథులు వస్తున్నారు’’ అసహనంగా అన్నాడు ప్రత్యగాత్మ. కన్నతల్లిని ‘అతిథి’ అనటానికి కించపడ్డాడు మనసులో. కానీ అంతకన్నా వివరాలు వాళ్ళకిచెప్పటం అనవసరం అనుకున్నాడు.

ఎవరో రానున్నారని వినగానే, వచ్చినవ్యక్తులు కొద్దిగా తత్తరపడ్డారు. ఈ సమయంలో అయితే, తీరిగ్గా మాట్లాడి, పనిపూర్తిచేసుకు వెళ్ళవచ్చు అనుకుని, రాత్రి తొమ్మిదిగంటలవేళ వచ్చారు వాళ్ళు. తమని తరుముతూ, మరెవరో అతిథులు రావటం వారికినచ్చలేదు. పోనీ, పని వాయిదావేసుకుని, మరోరోజు వద్దామా అంటే, అంత సమయం లేదు.‘‘మాకు తొందరగానే ఉంది సాబ్‌, మమ్మల్ని తెమిల్చి పంపటం మీ చేతుల్లోనే ఉంది’’ ఈసారి విష్ణుగొంతు పలికింది.‘‘చెప్పండి’’ అన్నాడు ప్రత్యగాత్మ, చిరు వ్యంగ్యం అతడి మాటలో.‘‘సూటిగా చెప్తాం, మీరు ట్రాన్సఫర్‌ తీసుకుని వెళ్ళిపోవాలి పదిహేను రోజులలోగా!ఈలోపు సైటు వైపు రాకూడదు.

రొటీన్‌ పనులు చూసుకుంటూ ఆఫీసులోనే కూర్చోవాలి....!’’ప్రత్యగాత్మ ఆశ్చర్యపడలేదు. ఉద్రేకాన్ని ఆపుకున్నాడు. అతనికి తెలుసు, ఉద్రేకం పనిచెయ్యదు. నెమ్మదిగానే మాట్లాడాలి. వాళ్ళు వినరు. తను లొంగడు. ‘వాళ్ళని పంపించటం ముఖ్యం. ఎలా మాట్లాడైనాసరే. అలాగని, వాళ్ళని మభ్యపెట్టటమూ అసాధ్యమే. తనేమిటో వాళ్ళకి కూలంకషంగా అర్థమైపోయింది’ మనసులోనే అనుకున్నాడు. కానీ వాళ్ళేమిటో అతనికి పూర్తిగా అర్థం కాలేదు. అదే అతని దురదృష్టం.