‘‘ఇది పదో బర్త్‌డే. ఈ ఏడాదన్నా మీ ఒక్కగానొక్క కొడుకు బర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేస్తారా? లేదా?’’ ఉదయం సుశీల అన్నమాట గుర్తుకొచ్చి ఉలిక్కిపడ్డాను.బైక్‌ నడుపుతున్నానన్న మాటేగానీ నా మనసు, మనసులో లేదు.‘‘శొంఠ్యాం దారిలో ఒక ఏజెంట్‌ ఉన్నాడు. అతన్ని కలిసి పాలసీలెన్ని ఉన్నాయో అన్నీ తీసుకుని ఫుల్‌ఫిల్‌ చెయ్యాలి. అటునుంచి ఇంకో ఏజంట్‌ దగ్గరకెళ్ళి...మిగతావాళ్ళందరికీ ఫోన్‌ చేసి ఉదయం పదో గంటకి ఇన్స్యూరెన్స్‌ ఆఫీసుకి వచ్చెయ్యమని చెప్పాలి’’ మనసులో అనుకున్నాను.

‘‘మీ అబ్బాయి పదో ఏడాది పుట్టినరోజునాడు జాగ్రత్తగా ఉండండి. మీ వాడికి పదేళ్ళు పూర్తైన మరు ఘడియకి.....గండం గట్టెక్కిపోయినట్టే! ఈ లోపు ఎటూ వెళ్ళకుండా ఇంటి దగ్గరే కనిపెట్టుకుని ఉండండి’’ గురువు కాళిదాసుగారు చెప్పిన మాట మదిలో మెదిలేసరికి ఉలిక్కిపడ్డాను. నా మెదడు మొద్దుబారిపోయింది. ఆయనన్నా, ఆయన మాటన్నా నాకు వేదం. మా ఇంటల్లిపాదికీ ఎంతో గురి.ఒకవైపు బిజినెస్‌ టార్గెట్‌, మరోవైపు ఒక్కగానొక్క కొడుకు కోసం నాకే అర్థంకాని ఏదో టార్చర్‌. కొడుకు బర్త్‌డే ఫంక్షన్‌కి రాకపోతే ఊరుకోనన్న భార్య...సమయానికి వెళ్ళగలనో లేదో అన్న ఆందోళన...మెదడు మొద్దుబారిపోతోంది.

మనసంతా కకావికలంగా ఉంది. ‘ఆఫీసా? ఇల్లా? టార్గెట్‌ గురించే ఆలోంచిలా? లేక పదేళ్ళ చిన్నారి చిట్టితండ్రి గురించే ఆలోచించాలా?’‘‘ఈ గండం గడిస్తే ఇక నూరేళ్ళదాకా డోకా లేదు. శాంతులు హోమాలతో కాలాన్ని, కాగల కార్యాన్ని ఎవరూ ఆపలేరు. అందుకు గ్రహాలు కూడా సమ్మతించవు. కానీ, పూజలతో మన భక్తితో కాస్త శ్రద్ధగా కాలాన్ని అనుక్షణం కనిపెట్టుకుని ఉంటే గ్రహాలు శాంతిస్తాయి. ప్రమాదాలు నెమ్మదిస్తాయి. గండాలు గట్టెక్కుతాయి. మీ వాడికి పదేళ్ళు నిండాక ఇక ఎలాంటి గండాలూ దరిచేరవు’’ గురువుగారన్న మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.