డిటెక్టివ్‌ శరత్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న గృహ శాఖ మంత్రి శరత్‌ని చూడగానే ‘నీకు జవహర్‌నగర్‌ మర్డర్‌ కేసు గురించి వివరాలు తెలుసా?’ అని అడిగాడు.తల ఊపాడు శరత్‌.‘టీవీల్లో, వార్తాపత్రికలలో చెప్తున్నంత మేరకే తెలుసు’ అన్నాడు.

‘ఆ కేసును నువ్వు టేకప్‌ చేయాలి’ అన్నాడు మంత్రి.ఆలోచించాడు శరత్‌.జవహర్‌నగర్‌ మర్డర్‌ కేసు ఉద్విగ్నత భరితమయినది. పలు విభన్నపు ఆంశాలు దాన్లో కలిసి ఉన్నాయి.శరత్‌ మౌనంగా ఉండటం చూసి మంత్రి అన్నాడు.‘ప్రతిపక్షాలు ప్రభుత్వ సంస్థలతో సంబంధం లేని నిష్పాక్షిమైన వ్యక్తితో పరిశోధన కొన సాగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అందరికీ నీ పేరే ఆమోదయోగ్యం’.‘కేసు టేకప్‌ చేస్తాను. కానీ పరిశోధనలో కానీ, ఫలితం ప్రకటించటంలో కానీ ఎవరి జోక్యం ఉండకూడదు’.‘ఉండదు. వీలయినంత త్వరగా నిజాన్ని తెలుసుకోవాలి. గొడవలు సద్దుమణగాలి’ అన్నాడు మంత్రి హామీ ఇస్తూ. ‘బాస్‌... వివరాలు సేకరించాను. మొత్తం పాయింట్స్‌ ప్రకారం రాశాను’ కొన్నికాగితాలు శరత్‌కి అందిస్తూ చెప్పాడు అసిస్టెంట్‌ రాము.చదవటం ఆరంభించాడు శరత్‌.

ఇటీవలి కాలంలో జవహర్‌నగర్‌లో పలురకాల ఉద్విగ్నతలు చెలరేగాయి. తీవ్రవాదులు జవహర్‌నగర్‌పై పట్టు సంపాదిస్తున్నారన్న అనుమానంతో ప్రభుత్వం సైన్యాన్ని ఆ ప్రాంతానికి పంపింది.సైన్యం తమ ప్రాంతంలో ఉండటాన్ని జవహర్‌నగర్‌ ప్రజలు నిరసించారు. ఆ నిరసన తగ్గు ముఖం పడుతున్నదనిపించేలోగా, ఓరోజు తెల్లారి నగరం నాలుగు రోడ్ల కూడలిలో నగ్న యువతి శవం లభించింది.మిలటరీ వాళ్లు గుర్తు తెలియని యువతిని మానభంగం చేసి చంపి పారేశారన్న వార్త కార్చిచ్చులా వ్యాపించటంతో నిరసన మళ్ళీ ఆరంభమయింది.

ఈసారి నిరసన దేశం నలు మూలలకు పాకింది. అది రాజకీయరంగు పులుముకుంది. సైన్యం దూషణలు, ఆరోపణలు తీవ్రమయ్యాయి.‘ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో ఏమైనా తెలిసిందా?’ రాము రాసిన దాన్ని పూర్తిగా చదివి అడిగాడు శరత్‌.‘నో బాస్‌. అమ్మాయి ఎవరో తెలియటం లేదు బాస్‌’ చెప్పాడు రాము. కాస్సేపు ఆలోచించాడు శరత్‌. ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కి ఫోను కలిపాడు. ‘విజయ్‌... జవహర్‌నగర్‌ మర్డర్‌ కేసు పరిశోధన ఫైలు సంపాదించగలవా?’ అడిగాడు.‘అది మన పరిధికి బాహిరం. అయినా ప్రయత్నిస్తాను’ అన్నాడు విజయ్‌.