పరుగులాంటి నడకతో వస్తున్న వెంకన్నని చూసి సావిత్రి ‘లోపలి కొచ్చేస్తాడేమో’ అని భయపడి గబగబా ముందుకెళ్ళింది. గేటు ఇవతల్నించే ‘‘ఏంటి వెంకన్నా, ఆ కంగారు? ఏమైంది?’’ అని అడిగింది ఆదుర్దాగా.‘‘పెద్దయ్యగారు గుళ్ళో పడిపోయారమ్మా’’ ఆయాసపడుతూ చెప్పాడు వెంకన్న అవతల్నించే.ఆ మాట వినడంతోటే సావిత్రికి గుండె దడదడలాడి ఒళ్ళంతా నీరసం ఆవహించింది. అంత కంగారులోనూ ‘‘నువ్వు గుళ్ళోకెట్లా వెళ్ళావు?’’ అని అడగడం మాత్రం మర్చిపోలేదు.‘‘నేను గుళ్ళోకెల్ల లేదమ్మా. దారెంట ఎల్తుంటే చిన్నయ్యగారు చప్పట్లుకొట్టి పిల్సి ‘నాన్నగారు కళ్ళు తిరిగి పడిపోయారు. ఇంటికి తీసుకెల్లడానికి బండేదేనా సూడు’ అన్నారమ్మా. నేను ఎదురొచ్చిన ఆటోని గుడికాడికి పంపి, ఇసయం మీకు సెప్పాలని పరిగెత్తుకొచ్చానమ్మా’’ అన్నాడు వెంకన్న.‘‘పక్క సిద్ధం చేస్తాను’’ అంటూ ఇంట్లోకెళ్ళింది సావిత్రి.రామశాసి్త్రగారు ఆ ఊరి గుడి పూజారి. ఆయన కొడుకు శంకరశాసి్త్ర బి.ఎ. దాకా చదివినా, ఉద్యోగం వచ్చే లోపల ఖాళీగా ఉండడం ఎందుకని తండ్రితోబాటు గుడికి వెళ్ళడం మొదలుపెట్టి, ఉద్యోగం సంపాదించుకోలేక చివరికి అర్చకత్వంలోనే స్థిరపడిపోయాడు. తన స్థోమతకి ఎక్కువే అయినా ఒక్కగానొక్క కొడుకు రాజేష్‌ని మాత్రం పట్నంలో బి.టెక్‌. చదివిస్తున్నాడు.రామశాసి్త్రగారు వయసు పైబడ్డాక గుడి బాధ్యత పూర్తిగా కొడుక్కి అప్పజెప్పేశారు.

అయినా రోజూ ఏదో ఒక సమయంలో గుడికెళ్ళి దర్శనం చేసుకోందే ఆయనకు తోచదు. మరీ నీరసంగా ఉందని పది రోజులుగా గుడికి వెళ్ళని రామశాసి్త్రగారు ఆ రోజే సెలవలకి ఇంటికొచ్చిన మనవణ్ణి తోడు తీసుకుని గుడికి వెళ్ళారు. వాళ్ళటు వెళ్ళిన కాసేపటికే రామశాసి్త్రగారు గుళ్ళో పడిపోయారన్న వార్త మోసుకొచ్చాడు వెంకన్న.రామశాసి్త్రగారి ఇంటిపక్కనున్న ఖాళీ స్థలంలో అతను చిన్న పాక వేసుకుని కాపురముంటున్నాడు. అతను, అతని తండ్రి, భార్య, కొడుకు పొలాల్లో కూలి పనికి వెళ్తుంటారు. చదువు సంధ్యల్లేవని, ఆచారాలు, పద్ధతులు పాటించరని వాళ్ళంటే సావిత్రికి చులకన భావం. వెంకన్న కొడుకు శీను రాజేష్‌తో బాటు ఎనిమిదో తరగతి దాకా చదివి పనిలోకెళ్ళక తప్పని పరిస్థితుల్లో చదువు మానేశాడు. అవకాశమున్నప్పుడల్లా రాజేష్‌నడిగి అనేక విషయాలు తెలుసుకుని ప్రపంచజ్ఞానం పెంచుకుంటూ ఉంటాడు.