‘‘నన్ను చంపొద్దు... నీకు విడాకులిస్తా... ప్లీజ్‌ నాకు మంచినీళ్లు ఇవ్వు... నన్ను బతికించు... అబ్బా కొట్టొద్దు... నీ కాల్మొక్కుతా... నన్ను వదిలేయవే...’’ పదేపదే అవే మాటలను ఓ వ్యక్తి మంచం మీద నుంచి కిందపడి దొర్లుతూ ఎవరినో ప్రాధేయపడుతున్న దృశ్యాన్ని తెలుగులో అన్ని టీవీ ఛానళ్లు వందలసార్లు చూపించాయి.సాధారణంగా ఛానళ్లకు ఇలాంటి దృశ్యాలు దొరికాయంటే పండగే.ప్రేక్షకులు వాటిని అదే పనిగా చూస్తారనే విషయం వారికి బాగా తెలుసు. అందుకే ఆ ఫుటేజీని రోజంతా చూపించారు.ఆ రోజు మీడియాలో ఇదే హాట్‌ టాపిక్‌...

ఈ వీడియో వైరల్‌ అయి సోషల్‌ మీడియాలోనూ చక్కర్లు కొట్టింది.ఈ సంఘటన ఎక్కడ జరిగింది? వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు? తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరిని ప్రాధేయపడుతున్నాడు? ఇంతకీ వారిద్దరూ భార్యాభర్తలేనా? అన్నీ ప్రశ్నలే...పోలీసు అధికారులైతే వీడియో చూసి పాత ఫైళ్లు తిరగేయడం ప్రారంభించారు.మీడియా ప్రతినిధులు సమాంతర ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించారు.కొన్ని గంటల పాటు హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ఈ వీడియో దృశ్యాలు హల్‌చల్‌ సృష్టించాయి.సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని సరూర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ లింగయ్య ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు.‘‘ఇలా కూడా హింసిస్తారా? అతనెవరో... ఏమిటో...’’ అనుకున్నారాయన.వీడియో చూసిన రెండు గంటల తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆయన వద్దకు వచ్చారు.

‘‘సార్‌... పొద్దున్నుంచి టీవీల్లో వస్తున్నది చూశారా?’’‘‘చూశాను. వాడెవడో నన్ను చంపొద్దంటూ వేడుకుంటున్నాడు. ఏ ఛానల్‌ చూసినా అవే దృశ్యాలు కనిపిస్తున్నాయి కదా...’’‘‘వాడు మావోడే సార్‌... మా యాదగిరి బొమ్మే సార్‌ అదీ...’’‘‘అతడి పేరు యాదగిరా... అతను మీకు తెలుసా?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.‘‘ఆ రోజు మాకు అనుమానం రాలేదు సార్‌... ఏదో జబ్బు చేసి చనిపోయాడనుకున్నాం. కానీ వాడ్ని ఇంతలా కొట్టి చంపేశారని తెలియదు... ’’‘‘అతడు మీకేమవుతాడు? అసలు మీరెక్కడి నుంచి వచ్చారు’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఇన్‌స్పెక్టర్‌ లింగయ్య.‘‘సార్‌ నా పేరు వంశీ. ఈమె నా భార్య అనిత. ఈ వీడియోలో ఉన్నవాడు నా బావమరిది యాదగిరి...’’‘‘మీరెక్కడి నుంచి వచ్చారు? యాదగిరిని కొట్టి చంపారంటున్నావ్‌... కాస్త అర్థమయ్యేలా చెప్పు...’’