అర్థరాత్రి హఠాత్తుగా మెలుకువ వచ్చింది రామ్మూర్తికి.పక్కగది నుంచి మాటలు, నవ్వులూ...తెరలు తెరలుగా!స్పష్టాస్పష్టంగా భార్యని తట్టి లేపాడు. నిద్రాభంగానికి విసుక్కుంటూ లేచిందామె. ‘‘విను... విను’’ అన్నాడు రామ్మూర్తి. చెవులు రిక్కించి విన్నది పార్వతమ్మ. నిజమే. పక్కగది నుంచి ఉండుండి నవ్వులూ, మాటలూను! చటుక్కున లేచి ఆ గదివైపు నడుస్తున్న భర్తని విసుక్కుంటూ అనుసరించింది. తలుపులు దబదబా బాదగా ఐదునిమిషాల తర్వాత ఒళ్ళు విరుచుకుంటూ ఆవులిస్తూ విసుక్కుంటూ తలుపు తెరచింది అలేఖ్య. 

లోనికి దూసుకెళ్ళి గది అంతా కలియజూశాడు రామ్మూర్తి. పార్వతమ్మ కూడా చూసింది.ఆ గదిలో అలేఖ్య తప్ప మరెవరూ లేరు.‘మాటలూ, నవ్వులూ వినిపిస్తేనూ...’’ నసిగాడు రామ్మూర్తి.‘‘కన్నకూతురు మీద కూడా నమ్మకం లేదా?’’ భగ్గుమంది అలేఖ్య.గుమ్మం వరకూ వెళ్ళి గిరుక్కున వెనక్కి తిరిగి చకచకా బీరువా వెనక్కి వెళ్ళాడు రామ్మూర్తి. అక్కడుంది అసలు కీలకం! బయటకు లాగాడు.ఆరడుగుల అందగాడు! యువకుడు!ఇప్పుడేమంటారు? అన్నట్లు భార్య, కూతురు వైపు కొరకొరా చూసి యువకుడిని తిట్టి పోస్తూ చెంపలు వాయగొట్టాడు. వాడు విదిలించుకొని పారిపోయాక అమ్మాయి గర్జించింది. ‘‘పవన్‌ ఏం చేశాడని శివాలెత్తుతున్నావ్‌? అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవడమే ఘోరనేరమా?!’’ ఎదురు ప్రశ్నించింది కూతురు.

తప్పుచేసి పైగా జంకుగొంకు లేకుండా సమర్థించుకుంటున్నందుకు కోపం వచ్చినా తమా యించుకుని, ‘‘అర్థరాత్రి రహస్యంగా వచ్చి అదీ ఒంటరిగా అమ్మాయిని గదిలోకి ప్రవేశించి కలవడం ముమ్మాటికీ తప్పే’’ అన్నాడు తండ్రి రామ్మూర్తి.అలేఖ్య ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. విజృంభించింది. ‘‘ఏకాలంలో ఉన్నావ్‌నాన్నా! వయసొచ్చిన అమ్మాయి, అబ్బాయి ఇష్టపూర్వకంగా సెక్స్‌లో పాల్గొన్నా తప్పుకాదని సుప్రీంకోర్టే తీర్చు చెప్పింది. మేం అంత దూరం వెళ్ళలేదు. కేవలం వట్టి కబుర్లే చెప్పుకుంటున్నాం. అనుమానపిశాచంలాగా వెంటాడి వేధిస్తున్నావ్‌. నేనంటే నీకిష్టంలేదు.

ఎప్పుడైనా ప్రేమగా నాతో ఒక్కసారైనా మాట్లాడావా? మా ఫ్రెండ్స్‌ ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు, దుస్తులు, చెప్పులు వేసుకుని మెరిసిపోతుంటే చౌకబారు వస్తువులన్నీ నా ముఖానకొట్టావ్‌! డాక్టర్‌ అవ్వాలనుకుంటే ఎంసెట్‌లో మంచిర్యాంక్‌ రాలేదన్న సాకుతో చెత్త బియస్సీలోకి తోసేశావుగానీ యాభైలక్షలు పారేసి ప్రయివేటు మెడికల్‌ సీటు సంపాదించలేకపోయావు. నీకసలు నామీద ప్రేమ ఉంటే కదా! పిల్లలకోర్కెలు తీర్చలేనివాళ్ళు అసలు పిల్లల్ని ఎందుకు కనాలి?’’